భారత్లో కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రధాన నగరాల్లో కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.
మహాలో తీవ్ర రూపం...
మహారాష్ట్రలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. గతేడాది వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో ఒక్కరోజే 27,126 కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం శనివారం ప్రకటించింది.
మహారాష్ట్రలోని కొన్ని నగరాల్లో ఇప్పటికే పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలవుతోంది. అయితే... ఈ ఆంక్షల నడుమే స్టేట్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు అక్కడి అధికారులు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
వారాంతపు లాక్‌డౌన్
మధ్యప్రదేశ్లోని భోపాల్, ఇందోర్, జబల్‌పూర్ తదితర నగరాల్లో ప్రతి ఆదివారం లాక్‌డౌన్ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా.. ఆయా నగరాల్లోని రహదారులు నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలు తెరుచుకోలేదు. అయితే నిత్యావసర వస్తువులు, సేవలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ నెలాఖరు వరకు కళాశాలలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
పాఠశాలలు బంద్..
తమిళనాడులో మార్చి 22 నుంచి.. 9, 10, 11 తరగతులను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్ర బోర్డు పరీక్షలు మినహా ఇతర బోర్డు పరీక్షలకు హాజరవడానికి 10వ తరగతి విద్యార్థులకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది.
అమృత్సర్లో కర్ఫ్యూ..
పంజాబ్ అమృత్సర్ జిల్లాలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్రప్రభుత్వం. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ ఉంటుంది.
ఇదీ చూడండి: ఇటు పచ్చ కండువా.. అటు పచ్చ జెండా