Cyclone Jawad IMD: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి 'జవాద్' తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శుక్రవారం తెలిపింది. ఇది శనివారం ఉదయం నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరంలోని పశ్చిమ-మధ్య బంగాళాఖాతాన్ని తాకుతుందని చెప్పింది. అక్కడి నుంచి ఉత్తర- ఈశాన్యం దిశగా పయనించి.. డిసెంబరు 5 మధ్యాహ్నం నాటికి పూరీలో తీరం దాటుతుందని పేర్కొంది.
"తుపాను కారణంగా ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఒడిశా ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. శనివారం నాటికి వర్షాపాతం అధికంగా మారుతుంది."
-భారత వాతావరణ శాఖ
"అండమాన్ సముద్రంలో నవంబరు 30న అల్పపీడనం ఏర్పడింది. అది డిసెంబరు 2న బలపడి వాయుగుండంగా మారింది. అది మరింత బలపడి శుక్రవారం ఉదయం తీవ్ర వాయుగుండంగా మారింది. శుక్రవారం మధ్యాహ్నం అధి తుపానుగా మారింది" అని ఐఎండీ తెలిపింది.
తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో, ఒడిశాలోని గంజాం, గజపతి, పూరీ, జగత్సింగ్పుర్ జిల్లాల్లో శనివారం అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.తుపాను నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్డీఆర్ఎఫ్) అప్రమత్తమైంది. సహాయక చర్యల కోసం 64 బృందాలను సిద్ధం చేసుకుంది. ఈ మేరకు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కుమార్ తెలిపారు.
"తుపాను పరిస్థితిని ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. తుపాను ప్రభావిత రాష్ట్రాలైన ఒడిశా, బంగాల్, ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికే 46 బృందాలను పంపించాం. మరో 18 బృందాలను సిద్ధంగా ఉంచాం. ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ బృందంలో 30 మంది సిబ్బంది ఉంటారు. "
-అతుల్ కుమార్, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్
తుపాను పరిస్థితులపై ప్రధానమంత్రి నేతృత్వంలోని జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ, ఇతర అధికారులు సమీక్ష నిర్వహించారని అతుల్ కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: 'సవాళ్లను ఎదుర్కొనేందుకు నేవీ సదా సన్నద్ధం'