హత్యాచార దోషులకు మరణ (death penalty in india) దండన విధించడానికి.. వారి చేతిలో అఘాయిత్యాలకు గురైన బాధితులు చిన్నారులన్న ఒకే ఒక్క కారణం సరిపోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇరప్ప సిద్ధప్ప అనే వ్యక్తి ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, తర్వాత ఆమెను చంపేశాడు. ఆ శవాన్ని ఓ సంచిలో కుక్కి కాలువలో పడేశాడు. విచారణ జరిపిన దిగువ కోర్టు సిద్ధప్పకు మరణశిక్ష విధించింది. కర్ణాటక హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. చివరికి ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్.గవాయిల ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. సిద్ధప్ప నేరానికి పాల్పడినట్టు (sc on death penalty) వెల్లడించిన ధర్మాసనం.. కింది కోర్టులు అతనికి విధించిన మరణ శిక్షను 80 ఏళ్ల ఖైదుగా మార్పు చేసింది.
"బాధితురాలు చిన్నారి అన్న ఒకే ఒక్క కారణంతో దోషికి మరణశిక్ష విధించలేం. గత 40 ఏళ్లలో సుప్రీంకోర్టు దృష్టికి ఇలాంటి కేసులు 67 వచ్చాయి. వీటన్నింటిలో బాధితులు మైనర్లు అన్న ఒకే ఒక్క కారణంతో దిగువ కోర్టులు దోషులకు మరణదండన విధించాయి. వీటిలో ఇప్పటివరకూ 12 కేసుల్లోనే సుప్రీంకోర్టు మరణ శిక్షను ఖరారు చేసింది." అని ధర్మాసనం పేర్కొంది. అతడి శిక్షను తగ్గించకూడదని, ముందుగా విడుదల చేయకూడదని షరతు విధించింది.
ఇదీ చదవండి:'న్యాయ వృత్తి లాభం కోసం కాదు.. సమాజ సేవకే'