'ది కేరళ స్టోరీ' తరహా ఘటన దిల్లీలో జరిగింది. మహిళతో ప్రేమగా మాట్లాడుతూ పరిచయం పెంచుకొని.. అత్యాచారం చేసి.. భయపెట్టి.. చివరకు హత్య చేస్తానని బెదిరిస్తున్నాడో వ్యక్తి. 11 ఏళ్ల క్రితం ఆమెకు మత్తు ఇచ్చి అత్యాచారం చేసిన అతడు.. అనంతరం బెదిరించి, మతం మార్చి వివాహం చేసుకున్నాడు. నిత్యం ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు. తాజాగా ఇంకో మహిళలను వలలో వేసుకుని.. మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. అప్పట్లో పోలీసుగా పని చేసిన ఆ వ్యక్తి.. ఇప్పుడు బాధితురాలిని చంపేసి, శ్రద్ధా వాకర్ తరహాలో 36 ముక్కలు చేస్తానని బెదిరిస్తున్నాడు. అందుకు కుటుంబ సభ్యులు కూడా సహరిస్తున్నారు. దిల్లీలో ఈ ఘటన జరిగింది.
ఈ మేరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. భర్త సోదరుడు కూడా తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది. తనను డ్రగ్స్ తీసుకోవాలని నిత్యం భర్త వేధించేవాడని తెలిపింది. భర్త, అత్తింటివారి బాధలు భరించలేని బాధితురాలు ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని.. యూపీలోని హాపుడ్ పోలీసులను ఆశ్రయించింది. భర్తపై, అతని కుటుంబ సభ్యులు సహా ఏడుగురిపై ఫిర్యాదు చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ భర్త.. 2012లో పోలీసు శాఖలో పనిచేస్తూ.. బాధితురాలి ఇంటి కిందే నివసించేవాడు. అదే సమయంలో నిందితుడి తల్లితో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. బాధితురాలితో నిందితుడి తల్లి ప్రేమగా మాట్లాడేది. తమ మతం గురించి చెబుతుండేది.
ఒకరోజు బాధితురాలిని ఇంటికి పిలిచిన నిందితుడి తల్లి.. మత్తు మందు ఇచ్చిన స్వీట్స్‌ను ఆమెతో తినిపించింది. అనంతరం సృహ కోల్పోయాక.. నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాసేపటి తరువాత మెలకువలోకి వచ్చిన బాధితురాలు.. ఘటన గురించి తెలుసుకుని కంగుతింది. అనంతరం ఆమెను బెదిరించిన నిందితుడు.. ఈ విషయం బయట చేబితే కుటుంబ సభ్యుల చంపేస్తానని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమె మతం కూడా మార్పించాడు.
"పెళ్లైన నాటి నుంచి నా భర్త నన్ను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ మధ్య పరిచయమైన ఓ మహిళతో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఎవరికైనా చెబితే నన్ను శ్రద్ధా వాకర్ తరహాలో 36 ముక్కలుగా నరికేస్తామని.. నా భర్త, అత్తింటి వారు బెదిరిస్తున్నారు. నా భర్త సోదరుడు కూడా నాపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు" అని బాధితురాలు హాపుడ్ పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.
మరో లవ్ జిహాద్ కేసు..
ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా ఇలాంటి లవ్ జిహాది ఘటనే వెలుగులోకి వచ్చింది. కోచింగ్ సెంటర్లో హిందూ మహిళకు పరిచయమైన ముస్లిం యువకుడు.. ఆనంద్‌గా పేరు మార్చుకుని ఆమెకు దగ్గరయ్యాడు. అనంతరం యువతిని గుడిలో పెళ్లి చేసుకున్నాడు. స్నేహితుడి రూంలో ఉంచి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి ఆమెను బెదిరించటం మొదలు పెట్టాడు. కొద్ది రోజులకు బాధితురాలు గర్భం దాల్చింది.
దీంతో బరేలీలోని జాదోపూర్ ఉన్న యువకుడి ఇంటికి వెళ్లింది యువతి. అప్పుడే ఆమెకు ఆనంద్ హిందువు కాదని.. ముస్లిం అని తెలిసింది. జరిగిన విషయమంతా నిందితుడి కుటుంబ సభ్యులకు తెలిపింది బాధితురాలు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి.. బలవంతంగా అబార్షన్ చేయించారు నిందితుడి కుటుంబ సభ్యులు. ఘటన గురించి ఎవరికైన చెబితే చంపేస్తామని బెదిరించారు. దీంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. నిందితుడిపై ఫిర్యాదు చేసింది.