Loudspeaker Row: లౌడ్‌స్పీకర్ల అంశంపై మహారాష్ట్రలో దుమారం రేగుతోంది. మసీదుల్లో లౌడ్స్పీకర్లు తొలగించాలని ఇదివరకే ప్రజలకు పిలుపునిచ్చారు మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే. 4వ తేదీలోగా వాటిని తొలగించని పక్షంలో.. మసీదుల ఎదురుగా లౌడ్స్పీకర్లలో హనుమాన్ చాలీసా పఠించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముంబయి ఛర్కోప్లోని ఓ మసీదు సమీపంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు లౌడ్స్పీకర్లలో హనుమాన్ చాలీసా వినిపించారు. పార్టీ జెండా పట్టుకున్న ఓ ఎంఎన్ఎస్ కార్యకర్త.. హనుమాన్ చాలీసా పఠిస్తూ కనిపించాడు. ఈ మేరకు ఓ వీడియో బయటకు వచ్చింది. అదే సమయంలో ఎదురుగా ఉన్న మసీదు నుంచి లౌడ్స్పీకర్లలో 'ఆజాన్' వినిపిస్తోంది.
మరోవైపు ఠాణెలోని ఇందిరా నగర్ ప్రాంతంలోనూ కొందరు ఎంఎన్ఎస్ కార్యకర్తలు స్పీకర్లతో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ కనిపించారు. అయితే.. అక్కడ సమీపంలో మసీదు లేకపోవడం గమనార్హం. 4వ తేదీ నుంచి మసీదులపై లౌడ్స్పీకర్లు మూగబోయేలా చేయాలంటూ ఇదివరకే వివాదాస్పద ప్రకటన చేసిన ఠాక్రేపై ఔరంగాబాద్‌లో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. గత రాత్రి పోలీసులు నోటీసు అందించారు. ఆయన తన వ్యాఖ్యల నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మసీదుల నుంచి ఆజాన్ వినిపిస్తే వెంటనే 100కు డయల్ చేసి పోలీసు కంట్రోల్ రూంకు చెప్పాలని, హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్లలో వినిపించాలని ప్రజలకు మరోసారి పిలుపునిచ్చారు.
బాల్ ఠాక్రే వీడియో షేర్ చేసిన రాజ్ ఠాక్రే: మసీదుల్లో లౌడ్‌స్పీకర్లపై వ్యతిరేకంగా.. శివసేన వ్యవస్థాపకులు బాల్ ఠాక్రే గతంలో మాట్లాడిన ఓ వీడియోను బుధవారం.. ట్విట్టర్లో పోస్ట్ చేశారు రాజ్ ఠాక్రే. 'రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ప్రజలను రోడ్లపై నమాజ్ చేయకుండా నిరోధించడంలో విజయం సాధించేవరకు శివసేన విశ్రమించదు. మసీదుల్లో లౌడ్స్పీకర్లను తొలగిస్తాము.' అని బాల్ ఠాక్రే చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది.
- — Raj Thackeray (@RajThackeray) May 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
— Raj Thackeray (@RajThackeray) May 4, 2022
">— Raj Thackeray (@RajThackeray) May 4, 2022
భద్రత కట్టుదిట్టం: లౌడ్స్పీకర్లలో హనుమాన్ చాలీసా పఠించాలన్న ఠాక్రే ప్రకటన నేపథ్యంలో.. మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంబయి, పుణె సహా పలు నగరాల్లో భారీగా పోలీసుల్ని మోహరించింది. రాజ్ ఠాక్రే నివాసం ఎదుట కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. ముంబయి పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే కూడా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ శాంతిభద్రతలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
శివసేనదే అసలైన హిందుత్వం: మహారాష్ట్ర శాంతియుతంగా ఉందని, ఎలాంటి నిరసలను జరగట్లేదని అన్నారు శివసేన నేత సంజయ్ రౌత్. దేశానికి హిందుత్వాన్ని నేర్పింది బాల్ ఠాక్రే, వీర్ సావర్కర్ అని.. శివసేనదే అసలైన హిందుత్వం అని.. పరోక్షంగా రాజ్ ఠాక్రేకు చురకలంటించారు.
ఇవీ చూడండి: 'మసీదులపై అవి తీసేయాల్సిందే'.. కేసు పెట్టినా వెనక్కితగ్గని ఠాక్రే