ప్రయాణంలో ఉండగా బైక్ పంక్చర్ అయితే.. మెకానిక్ షాపు ఎక్కడుందా? అనుకుంటూ బండి తోసుకుంటూ వెళ్తాం. షాపు వరకు నెట్టుకుంటూ వెళ్లేసరికి చుక్కలు కనబడతాయి! అదే కారు లాంటి నాలుగు చక్రాల వాహనాలైతే అక్కడే వదిలేసి.. మెకానిక్ జాడకోసం తిరుగుతాం. వాహనదారులు నిత్యం ఎదుర్కొనే ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొంది బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ సంస్థ. 'అదే లైవ్ పంక్చర్ యాప్'.
వాహనదారులు ఉన్నచోటుకే వచ్చి పంక్చర్ సేవలను అందించేందుకు వీలుపడేలా ఈ యాప్‌ను రూపొందించింది బ్లాక్‌పెన్ కమ్యూనికేషన్స్. బెంగళూరులో ఇలాంటి సేవలు ఇదే తొలిసారి!
ఈ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. వాహనదారులు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఈ కింది లింక్‌ను ఓపెన్ చేసైనా పొందవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.livepuncherapp
ఈ యాప్‌ను ఎలా వాడాలి?
లైవ్ పంక్చర్ యాప్‌ను డౌన్ చేసిన తర్వాత.. వినియోగదారుడు తన పేరు, ఫోన్ నెంబర్, ఎన్ని చక్రాలను రిపేర్ చేయాలి? లాంటి వివరాలను నమోదు చేయాలి.
ఈ యాప్‌లో సమీపంలోని పంక్చర్ షాపు సమాచారం, దాని ఫోన్ నెంబర్‌ను కూడా పొందవచ్చు. దాంతో వారికి ఫోన్ చేసి.. మీరున్న చోటుకు రమ్మంటే చాలు. వారు ఎంత దూరంలో ఉన్నారు? ఎంత సమయంలో వస్తారు? అనే సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. పంక్చర్ షాపు యజమానులు కూడా తమ షాపు వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు.
పూర్తిగా ఉచితం..
"ఈ యాప్ పూర్తిగా ఉచితం. పంక్చర్ వర్కర్లను వాహనదారులు సులువుగా కలుసుకునేలా చేయడమే దీని ఉద్దేశం. అసంఘటిత రంగంలోని పంక్చర్ వర్కర్లకు దీని ద్వారా సహాయం చేయాలని అనుకుంటున్నాం. వారి నుంచి సంస్థ ఎలాంటి ఫీజు, కమిషన్ వసూలు చేయదు." అని సంస్థ సహ వ్యవస్థాపకుడు సమీర్ దలసనూర్ తెలిపారు.
ఇదీ చూడండి: Plane Tyre Burst: విమానం టైర్ పంక్చర్- ప్రయాణికులు దిగి ఏం చేశారంటే..