పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన సిఫారసుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
రెండ్రోజుల క్రితం శాసనసభలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో అధికార కాంగ్రెస్ బల నిరూపణ చేసుకోకపోవడం వల్ల ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాజపా, దాని కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్టినెంట్ గవర్నర్ బుధవారం ఉదయం సిఫారసు చేశారు. గురువారం పుదుచ్చేరిలో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
ఇటీవల పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ క్రమంలో శాసనసభలో కాంగ్రెస్ బలం తగ్గింది. దీంతో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించగా నారాయణ స్వామి ప్రభుత్వం అందులో నెగ్గలేకపోయింది. ఓటింగ్‌కు ముందుగానే సీఎం, మంత్రులు రాజీనామా పత్రాలను గవర్నర్‌కు సమర్పించి వాకౌట్ చేశారు. విశ్వాస పరీక్షలో అధికార పార్టీ విఫలమైనట్లు స్పీకర్ శివకొళుందు ప్రకటించారు.