Ghaziabad Leopard News: ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. నగరంలో ప్రాంతాల్లో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీటీవీల్లో నమోదయ్యాయి. చిరుత భయంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు సాహసించడం లేదు. అయితే ఇదే బెదురుతో.. ఒక్కోసారి వీధికుక్కను చూసినా చిరుతపులిగా భ్రమపడుతున్నారు నగరవాసులు. అధికారులకు ఫోన్ చేసి చిరుతపులి సంచరిస్తోందంటూ ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇటీవల దస్నా జైలు వద్ద రాత్రుళ్లు ఓ వీధికుక్కను చూసి చిరుత అనుకుని భ్రమపడిన ప్రజలు.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన అధికారులు.. అది కుక్క అని తేల్చారు. ఇలా.. తమ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోందంటూ రోజూ కాల్స్ వస్తున్నాయని అధికారులు తెలిపారు.
ఇదే విషయంపై గాజియాబాద్ అటవీ అధికారి దీక్షా బండారి స్పందించారు. గాజియాబాద్ పక్కనే దాద్రీ ఎన్టీపీసీ, గోముఖ్తేశ్వర్ అటవీ ప్రాంతాలకు శీతాకాలంలో చిరుతపులులు వస్తుంటాయన్నారు. నదులు, కాలువలు, పచ్చదనం అధికంగా ఉన్నందున నగరంలో చిరతలు సంచరిస్తుంటాయని తెలిపారు.
ఇదీ చూడండి: తమిళనాడులో ఆ ప్రాంతాలు జలదిగ్బంధం- విద్యాసంస్థలు బంద్