Brig LS Lidder last rites: తమిళనాడులోని కున్నూరులో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి త్రిదళాధిపతి జనరల్ బిపిన్‌రావత్ పాటే చనిపోయిన బ్రిగేడియర్ ఎల్‌ఎస్ లిద్దర్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. దిల్లీలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో సైనిక లాంఛనాలతో లిద్దర్ అంతిమ సంస్కారాలు జరిగాయి.
అంతకుముందు లిద్దర్ పార్థివదేహం వద్ద రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె సహా పలువురు సైనికాధికారులు నివాళులర్పించారు.
పాలెం ఎయిర్‌బేస్ నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో లిద్దర్ భౌతికకాయాన్ని దిల్లీలోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖలు నివాళులర్పించిన తర్వాత బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికకు తరలించారు. అక్కడే లిద్దర్ కుటుంబ సభ్యుల సహా సైనికులు కన్నీటి వీడ్కోలు పలికారు.
బ్రిగేడియర్ లిద్దర్ ఎవరు?
ఎల్‌ఎస్ లిద్దర్.. 1969 జూన్ 26న పంజాబ్‌లో జన్మించారు. 1990 డిసెంబరులో జమ్ముకశ్మీర్ రైఫిల్స్‌లో(జేఏకేఆర్ఐఎఫ్) జవాను హోదాలో చేరారు. భారత సైన్యంలో.. మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్‌లో డైరెక్టర్‌గా విధులు నిర్వహించిన లిద్దర్.. కజకిస్థాన్‌లో డిఫెన్స్ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. దేశ ఉత్తర సరిహద్దుల్లో ఓ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించారు. ఐక్యరాజ్యసమితి రక్షణ దళంలో కూడా లిద్దర్ విధులు నిర్వహించారు. ఆ సమయంలో కాంగోలో జేఏకేఆర్ఐఎఫ్ బెటాలియన్ నాయకత్వం వహించారు. ఆయన సేవలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. 2020లో సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్ పురస్కారాలను అందుకున్నారు. 2021లో త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సహాయకుడిగా లిద్దర్ నియమితులయ్యారు. ఇటీవల మేజర్ జనరల్ ర్యాంక్‌కు ఎంపికైనట్లు సమాచారం.
లిద్దర్‌కు భార్య గీతిక లిద్దర్, కుమార్తె ఆశనా ఉన్నారు.
ఇదీ చూడండి: Last Rites of CDS: దిల్లీలోని నివాసానికి రావత్ దంపతుల భౌతికకాయాలు