రైల్వే ఉద్యోగాల కుంభకోణం కేసు విచారణను వేగవంతం చేసింది ఈడీ. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సన్నిహితుల ఇంట్లో చేపట్టిన సోదాల్లో లెక్కల్లో లేని సుమారు రూ. కోటి నగదుతో పాటు.. రూ. 600 కోట్ల విలువైన పత్రాలను స్వాధీనం చేసుకుంది ఈడీ. వీటితో పాటు రూ.కోటి విలువైన 540 గ్రాముల బులియన్ బంగారం, 1.5 కిలోల బంగారు అభరణాలను సీజ్ చేసింది. లాలూ కుటుంబ సభ్యులు సహా వివిధ రంగాల్లో ఉన్న లాలూ సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టింది ఈడీ.
ఉప ముఖ్యమంత్రి తేజస్వీకి సమన్లు..
ఈ కేసులో భాగంగానే బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు చెందిన నివాసంలో ఈడీ శుక్రవారం సోదాలు జరిపింది. తాజాగా ఈ కేసులో విచారణకు రావాలంటూ సీబీఐ శనివారం ఆయనకు సమన్లు జారీ చేసింది. ఆ తనిఖీల్లో భాగంగా గర్భిణీ అయిన తేజస్వీ యాదవ్ భార్యను 15 గంటల పాటు ప్రశ్నల పేరుతో వేధించినట్లు ఆర్జేడీ ఆరోపించింది. దీంతో ఆమె రక్తపోటు పెరిగి అనారోగ్యానికి గురయ్యారని.. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని సీబీఐకి ఆయన సమాచారమిచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
అంతకుముందు శుక్రవారం కూడా లాలుప్రసాద్ యాదవ్ బంధువుల నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. దిల్లీ, బిహార్‌లోని లాలూ బంధువుల ఇళ్లలో ఈడీ దాడులు చేసింది. దిల్లీలోని లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెలు మీసా భారతి, చందా యాదవ్, హేమా యాదవ్, రాగిణి యాదవ్ నివాసాలపై ఈ దాడులు జరిపింది. వీరితో పాటు ఆర్జేడీ నేత, మాజీ ఎమ్మెల్యే అబు దోజానా ఇంట్లోనూ ఈడీ సోదాలు చేసింది. ఈ కేసుకు సంబంధించి అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌ను సీబీఐ బృందం ప్రశ్నించిన కొద్ది రోజుల తర్వాత ఈడీ ఈ సోదాలు నిర్వహించింది. లాలూ ప్రసాద్‌ను సీబీఐ మంగళవారం రెండు సెషన్లలో దాదాపు ఐదు గంటల పాటు ప్రశ్నించింది. అంతకుముందు ఆయన సతీమణి రబ్రీదేవిని కూడా సీబీఐ విచారించింది. వీరితో పాటు మరో 14 మందిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద సీబీఐ ఇప్పటికే అభియోగ పత్రం దాఖలు చేసింది.
కేసు ఏంటంటే?
2004 నుంచి 2009 మధ్య లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భారతీయ రైల్వేలో 'గ్రూప్-డీ' ఉద్యోగాల కోసం లాలూ, ఆయన కుటుంబ సభ్యులు అవకతవకలకు పాల్పడినట్లు సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆయన కుటుంబ సభ్యులు కొందరి దగ్గర భూమిని లంచంగా తీసుకున్నారని ఆరోపించింది. ఈ కేసులో లాలూ ప్రసాద్.. పట్నా జోన్‌కు చెందిన కొందరికి కోల్‌కతా, ముంబయి, జైపుర్, జబల్పుర్ వంటి జోన్లలో రైల్వే ఉద్యోగాలు ఇప్పించారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇందుకు బదులుగా ఉద్యోగాల పొందిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు.. వారి భూములను లాలూ ప్రసాద్‌కు చెందిన కంపెనీలకు బదిలీ చేశారని సీబీఐ అభియోగ పత్రంలో వివరించింది.