Labh Singh Ugoke AAP: పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసి సీఎం అభ్యర్థి చరణ్‌జీత్ సింగ్ చన్నీపై విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు లభ్ సింగ్ ఉగోకే. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఓడించడం ఓ కారణమైతే.. ఆయన తల్లి పాఠశాలలో స్వీపర్‌గా పనిచేయడం మరో కారణం. ఇప్పుడు లభ్ సింగ్.. తల్లి గత 25 ఏళ్లగా పనిచేస్తున్న ఆ పాఠశాలకే ముఖ్యఅతిథిగా వెళ్లారు.
కొడుకు ఎమ్మెల్యేగా గెలుపొందినా.. ఆమె మాత్రం స్వీపర్ వృత్తినే కొనసాగిస్తున్నారు. పాఠశాల పరిసరాలు ఊడుస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన లభ్‌సింగ్.. భదౌర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 37వేలకు పైగా మెజారిటీతో చన్నీని ఓడించారు. అయితే లభ్ సింగ్ తల్లి బల్దేవ్ కౌర్ మాత్రం.. ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఏళ్ల తరబడి చేస్తున్న ఉద్యోగాన్నే కొనసాగిస్తున్నారు. తన కొడుకు ఎమ్మెల్యే అయినా తాను స్వీపర్ పనినే చేస్తానని 'ఈటీవీ భారత్'కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు కౌర్.
"లభ్ సింగ్ కచ్చితంగా పంజాబ్‌లో మార్పులు తీసుకొస్తాడు. అతడు అందరికీ వైద్యం, విద్య అందిస్తాడు. నా కొడుకు ఎమ్మెల్యే అయినా క్లీనర్ పనిని కొనసాగిస్తా. ఎన్నికలో గెలుస్తానని లభ్ సింగ్ మొదటినుంచి ధీమాగా ఉన్నాడు."
-బల్దేవ్ కౌర్, ఎమ్మెల్యే లభ్ సింగ్ తల్లి
ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా తన కుమారుడు పనిచేయాలని కోరుకుంటున్నానని లభ్ సింగ్ తండ్రి దర్శన్ సింగ్ అన్నారు. ఇక లభ్ సింగ్ చిన్నప్పుడు ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం చేశారని.. కొంతకాలం క్రితం వరకు మొబైల్ రిపేరింగ్ షాప్‌లో పనిచేశారని పాఠశాల హెడ్ మాస్టర్ అమ్రిత్ పాల్ కౌర్ తెలిపారు. మరోవైపు లభ్ సింగ్ విజయంతో ఆయన స్వగ్రామంలోని ప్రజలు సంబరాలు చేసుకున్నారు. మేము ఈ విజయాన్ని నమ్మలేకపోతున్నామని అంటున్నారు.
లభ్ సింగ్ 2013లో ఆప్‌లో చేరారు. నిరంతర కృషితో కొద్దికాలంలోనే పార్టీలో కీలక నేతగా ఎదిగారు. పంజాబ్‌లో ఆప్ ఘన విజయం సాధించింది. 117 అసెంబ్లీ సీట్లకు గాను 92 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 18 సీట్లకే పరిమితమైంది.
ఇదీ చూడండి : అతడు సినిమా 'రివర్స్'.. ఆస్తి కోసం కొడుకుగా నటించి.. 41 ఏళ్ల తర్వాత..!