బస్సులో వెళ్తున్నప్పుడు ఎవరైనా పెద్దగా సౌండ్(Playing Music On Bus) పెట్టుకుని వీడియోలు చూడటం.. అందరికి వినిపించేలా పాటలు పెట్టడం.. తోటి ప్రయాణికులకు ఇబ్బందికర వ్యవహారమే. వద్దని చెప్పినా మాట వినరు కొందరు. ఇకనుంచి అలాంటివారిని బస్సులోంచి కిందికి దించేయొచ్చు. అవును.. కర్ణాటక హైకోర్టు తాజాగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం కేఎస్‌ఆర్టీసీ(Ksrtc) బస్సుల్లో ప్రయాణికులు తమ మొబైల్ స్పీకర్లలో అధిక సౌండ్‌తో పాటలు ప్లే చేయడం నిషేధం.
బస్సు లోపల 'నాయిస్ డిస్ట్రబెన్స్' విషయంలో ఆంక్షలు విధించాలని కోరుతూ ఓ పిటిషనర్ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మొబైల్ ఫోన్‌లలో అధిక వాల్యూమ్‌లో పాటలు, వీడియోలు ప్లే చేయడాన్ని కట్టడి చేయాలని అందులో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు కేఎస్‌ఆర్టీసీ(Ksrtc) మేనేజింగ్ డైరెక్టర్... శివయోగి కాలసాద్ గురువారం మార్గదర్శకాలను విడుదల చేశారు.
- బస్సులో ప్రయాణించేవారెవరూ అధిక వాల్యూమ్‌తో పాటలు పెట్టడం, వీడియోలు చూడడం చేయకూడదు.
- బస్సులో ఎవరైనా తమ ఫోన్లలో అధిక వాల్యూమ్ పెడితే.. బస్సు కండక్టర్ పెట్టినవారిని మొదట వారించాలి.
- బస్సు కండక్టర్ మాటలను పట్టించుకోనట్లైతే.. సదరు ప్రయాణికుడు బస్సు దిగే వరకు డ్రైవర్ బస్సును నిలిపి ఉంచాలి.
- అయినప్పటికీ.. ప్రయాణికుడు గనుక బస్సు దిగకపోతే.. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.
కేఎస్‌ఆర్టీసీ(Ksrtc) తాజా నిర్ణయాన్ని కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.
ఇదీ చూడండి: Special Trains: 'స్పెషల్ రైళ్లు' రద్దు చేస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు