Knife In Young Man Stomach For Five Years : ఓ వైద్యుడి నిర్లక్ష్యం.. యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఐదేళ్లుగా అతడు కడుపులో కత్తితో జీవనం సాగించాడు. కడుపునొప్పితో ఆస్పత్రులు తిరుగుతూ నరకం అనభవించాడు. ఐదేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుజరాత్లో భరూచ్ జిల్లా అంకాలేశ్వర్‌లో జరిగింది.
అసలు ఏం జరిగిందంటే?
అంకాలేశ్వర్‌కు చెందిన అతుల్ గిరీ అనే యువకుడు ఐదేళ్ల క్రితం కత్తిపోట్లకు గురయ్యాడు. అప్పుడు వైద్యం కోసం స్థానికంగా ఉన్న భరూచ్ సివిల్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడున్న వైద్యుడు బాధితుడిని సరిగ్గా పరీక్షించకుండానే ట్యాబ్లెట్లు ఇచ్చి ఇంటికి పంపించాడు. క్రమంగా అతుల్‌కు కడుపునొప్పి ప్రారంభమైంది. దీంతో తరచూ ఆస్పత్రుల చుట్టూ తిరిగేవాడు. అయితే అతుల్ ఐదేళ్ల తర్వాత ఇటీవల ప్రమాదానికి గురయ్యాడు. అనంతరం అతడిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా అతుల్ తాను ఐదేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నట్లు వైద్యులకు తెలిపాడు. దీంతో డాక్టర్లు అతడికి పూర్తి బాడీ చెకప్ చేశారు. అతుల్ ఎక్స్-రే రిపోర్ట్‌లో కత్తిని చూసిన వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. మరో రెండు మూడు రోజుల్లో శస్త్ర చికిత్స నిర్వహించి కత్తిని బయటకు తీయనున్నట్లు వైద్యులు తెలిపారు.
కడుపులో గ్లాస్.. నాలుగు నెలలు నరకం
Glass In Stomach Xray : మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లాలో గతేడాది అక్టోబర్‌లో ఇలానే ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడు తనకు తీవ్రంగా కడుపు నొప్పిగా ఉందని జిల్లా ఆస్పత్రిలో చేరాడు. పరీక్షలు చేసిన వైద్యులు అతని పొట్టలో ఉన్న గ్లాసును చూసి షాక్‌కు గురయ్యారు. నాలుగు నెలలుగా ఆ గ్లాస్ తన కడుపులోనే ఉందని తెలుసుకుని నివ్వెరపోయారు.
అమావత్ గ్రామానికి వెళ్లిన రామ్‌దాస్ అనే వ్యక్తిని కొందరు దారుణంగా కొట్టి, అతడ్ని ఓ గ్లాస్‌పై కూర్చోబెట్టారు. దీంతో గ్లాస్ అతని పొట్టలోకి వెళ్లిపోయింది. గ్రామస్థులు ఈ అమానవీయ చర్యను చూసినప్పటికీ ఆ వృద్ధుడికి ఎటువంటి సహాయం చేయలేకపోయారు. ఘటన జరిగి నాలుగు నెలలు గడిచినా ఈ విషయాన్ని సిగ్గు కారణంగా రాందాస్ ఎవరికీ చెప్పలేదు. నొప్పి ఎక్కువ అవ్వడం వల్ల చతుఖేడ చేరుకుని గ్రామస్థులకు సమాచారం అందించాడు. దీంతో గ్రామస్థులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.