kerela blood cancer boy: కేరళలో ఓ ఏడేళ్ల బాలుడి ప్రాణం కాపాడేందుకు వేలాదిమంది ప్రజలు ముందుకు వచ్చారు. తిరువనంతపురంకు చెందిన ఏడేళ్ల శ్రీనందన్ రెండు నెలలుగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. వ్యాధి కారణంగా శరీరంలో రక్తాన్ని ఉత్పత్తి చేసే కణాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా రక్తం ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీనందన్‌ను బతికించుకోవాలంటే స్టెమ్ సెల్ థెరపీ ఒక్కటే మార్గమన్న వైద్యులు బాలుడి రక్త కణాలకు సరిపోయే రక్తంతోనే చికిత్స సాధ్యమని తెలిపారు.
వేలాదిగా తరలివచ్చిన రక్తకణ దాతలు: బాలుడి ప్రాణాలను కాపాడేందుకు రక్తదాతలంతా తిరువనంతపురంలో క్యాంపు ఏర్పాటు చేశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కావటంతో వేలాది మంది ప్రజలు క్యాంపు వద్దకు తరలివస్తున్నారు. రక్త కణాలు అందించేందుకు పరీక్షలు చేయించుకుంటున్నారు. మృత్యువుతో పోరాడుతున్న చిన్నారికి అవసరమైన రక్త కణాలు తమ వద్ద ఉంటే ప్రాణం నిలబడుతుందని తమ దయార్థ హృదయాన్ని చాటుతున్నారు. పరీక్షల కోసం వాలంటీర్ల లాలాజలాన్ని సేకరిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హెచ్ఎల్ఏ పరీక్ష ద్వారా బాలుడి చికిత్సకు సరిపోయే రక్త కణాలను గుర్తిస్తామని పేర్కొన్నారు. ఫలితాలు వచ్చేందుకు 45రోజుల సమయం పడుతుందన్నారు. బాలుడి చికిత్సకు అవసరమైన రక్తకణాలు త్వరలో లభిస్తాయని నిర్వాహకులు ఆశాభావంతో ఉన్నారు.
ఇదీ చదవండి: 'మోదీ స్టోరీ'.. ప్రధాని జీవితంలో ఎన్నో అరుదైన ఘట్టాలు..