కేరళలో అసెంబ్లీ ఎన్నికల కౌంట్‌డౌన్ మొదలైన క్రమంలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి రాజకీయ పార్టీలు. అభ్యర్థులంతా నియోజకవర్గాల్లో వీధి వీధి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేపనిలో నిమగ్నమయ్యారు. అయితే కేరళలోని నిలంబూర్ నియోజకవర్గానికి చెందిన అధికార ఎల్డీఎఫ్ ఎమ్మెల్యే పీవీ. అన్వర్.. మాత్రం అందుకు భిన్నంగా దక్షిణాఫ్రికాలో తిష్ట వేశారు. ఎమ్మెల్యే అంటే ఎల్లప్పుడూ నియోజకవర్గం ప్రజలతోనే ఉండాల్సిన అవసరం లేదని.. ఎక్కడినుంచైనా తన నియోజకవర్గం ప్రజలకోసం పనిచేయవచ్చని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో నిలంబూర్ నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నియోజకవర్గాన్ని విడిచి ఎక్కడో దక్షిణాఫ్రికాలో ఉన్న తమ ఎమ్మెల్యేను ప్రజలు.. తిరిగి పీఠం ఎక్కిస్తారా?
'అందుకే దక్షిణాఫ్రికాలో'
గత కొన్ని నెలలుగా నియోజకవర్గంలో కనిపించని ఎల్డీఎఫ్ ఎమ్మెల్యే పీవీ. అన్వర్.. అభ్యర్థి పేరు కేటాయిస్తారన్న కొద్ది రోజుల ముందు ఫేస్బుక్ లైవ్ సెషన్లో పాల్గొన్నారు. నియోజవర్గంలో మైనింగ్ సంస్థ ఏర్పాటుకోసం.. తాను దక్షిణాఫ్రికాలో ఉన్నట్లు తెలిపారు. ఆ సంస్థ వల్ల నిలంబూర్‌లో వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు.
" ఏ ఎమ్మెల్యే అయినా.. వ్యక్తిగతంగా నియోజకవర్గంలోనే కచ్చితంగా ఉండాలన్న నియమం లేదు. ఎక్కడి నుంచైనా తన ప్రజల బాగోగులు చూసుకోవచ్చు. ప్రజలు మరోసారి నన్ను ఎన్నుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. నేను భారీ ఆధిక్యంతో ఎన్నికల్లో విజయం సాధిస్తా. నిలంబూర్ నియోజకవర్గం ఒక్కటే కాదు.. కేరళ వ్యాప్తంగా ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తుంది."
-- పీవీ. అన్వర్, నిలంబూర్ ఎల్డీఎఫ్ అభ్యర్థి
![Kerala polls: Nilambur to decide whether 'physical presence of MLA' matters for constituency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11202062_img.jpg)
'ప్రజలను మర్చిపోయిన ఎమ్మెల్యే'
ప్రతిపక్ష యూడీఎఫ్, భాజపా నేతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
" అన్వర్ ఒక వ్యాపారవేత్త. ఆయన ఎన్నికల్లో విజయం సాధించాక నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవటం మర్చిపోయారు. తన సొంత వ్యాపారాలను చూసుకుంటున్నారు. అనేక అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. ఈసారి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు."
-- వీవీ. ప్రకాశ్, నిలంబూర్ యూడీఎఫ్ అభ్యర్థి
![Kerala polls: Nilambur to decide whether 'physical presence of MLA' matters for constituency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11202062_1.jpg)
" ఒక వ్యాపారవేత్త అయిన అన్వర్.. సామాన్య ప్రజలకు అందుబాటులో లేరు. ప్రజల అంచనాలను అందుకోవటంలో అన్వర్ విఫలమయ్యారు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతరేకంగా వ్యవహరిస్తున్నారు."
-- అశోక్ కుమార్, నిలంబూర్ భాజపా అభ్యర్థి
మరి ఎల్డీఎఫ్ ఎమ్మెల్యే పీవీ. అన్వర్.. వ్యాఖ్యలు నిజమవుతాయా? ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకం కాని నిలంబూర్ ఎమ్మెల్యేను ఓటర్లు తిరిగి పీఠం ఎక్కిస్తారా? తెలియాలంటే మే 2 వరకు ఆగాల్సిందే..
ఇదీ చదవండి : భాజపా 'సురేశ్ గోపీ' అస్త్రం ఫలించేనా?
కేరళలో బరిలోకి 'స్టార్ కిడ్స్'- వారసత్వం నిలిచేనా?