Foreigner With Liquor Bottles: నూతన సంవత్సర వేడుకలను ఘనంగా చేసుకోవాలనుకున్న ఓ విదేశీయుడి ఆశలపై నీళ్లు చల్లారు కేరళ పోలీసులు. కొత్త సంవత్సర వేడుకల కోసమని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి కొనుగోలు చేసిన లిక్కర్‌ను వెంట తీసుకుపోనీయకుండా అడ్డుకున్నారు. దీనికి నిరసనగా ఆ విదేశీయుడు తన దగ్గర ఉన్న మందును నేలపాలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదీ జరిగింది...
కేరళ తిరువనంతపురంలోని కోవాలంలో రసీదు లేని మద్యం సీసాలతో స్వీడన్ దేశస్థుడు పోలీసులకు చిక్కాడు. కోవాలం బీచ్ రోడ్డులో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో అతని దగ్గర మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు. వాటిని కొనుగోలు చేసినట్లు రసీదులు చూపించాలని విదేశీయుడ్ని కోరారు. కోవాలంలోని కేరళ అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం షాపులో బాటిళ్లను కొనుగోలు చేశానని వారికి చెప్పాడు. తన వద్ద బిల్ లేదని పోలీసులకు తేల్చి చెప్పాడు. పాస్‌పోర్ట్ చూసిన అధికారులు అతడ్ని స్టిగ్ స్టీఫెన్ యాస్బర్గ్గా గుర్తించారు.
అయితే మద్యాన్ని తీసుకుపోయేదానికి అనుమతించమని పోలీసులు యాస్బర్గ్కు తేల్చి చెప్పారు. దీంతో పోలీసుల ప్రవర్తనకు నిరసనగా మద్యాన్ని రోడ్డు పక్కన పారబోశాడు ఆ వ్యక్తి.
ఇదీ చూడండి: మహిళల వేలం పేరుతో వికృత చేష్టలు.. ఆ యాప్ బ్యాన్!