కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు విడుదలైన సమాచారం మేరకు.. గ్రామపంచాయతీ, బ్లాక్ పంచాయతీ, జిల్లా పంచాయతీల్లో అధికార ఎల్డీఎఫ్ కూటమి అధిక్యంలో దూసుకెళ్తోంది. గెలిచిన సీట్లలో ఎక్కువగా ఈ కూటమినే వరించాయి. మునిసిపాలిటీల్లో యూడీఎఫ్ ఆధిపత్యం కనిపిస్తోంది. కార్పొరేషన్లలో ఈ రెండింటి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ చాలా చోట్ల దెబ్బతింది. సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది.
తిరువనంతపురం, కోజికోడ్, కొల్లంలో ఎల్డీఎఫ్ తన ప్రభావాన్ని చూపెట్టింది. ఇక్కడ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
పుంజుకున్న భాజపా..
ఇప్పుడిప్పుడే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రభావం చూపుతున్న భాజపా.. కమ్యూనిస్టుల పాలనలో ఉన్న కేరళలో సత్తా చాటుతోంది. కొన్ని గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలను దక్కించుకుంది. కన్నూర్ కార్పొరేషన్లో తొలిసారి ఖాతా తెరిచింది కమలం పార్టీ.
2015లో ఒక్కటే మునిసిపాలిటీ(పాలక్కడ్)ని దక్కించుకున్న భాజపా.. ఈసారి స్థానాలను గణనీయంగా పెంచుకుంది. 4 చోట్ల గెలిచే అవకాశాలున్నాయి.
ఇప్పటివరకు ఆధిక్యం ఎలా..
గ్రామ పంచాయతీలు-941
- ఎల్డీఎఫ్- 515
- యూడీఎఫ్ - 376
- ఎన్డీఏ - 28
- ఇతరులు -22
బ్లాక్ పంచాయతీలు-152
- ఎల్డీఎఫ్-108
- యూడీఎఫ్- 44
జిల్లా పంచాయతీలు(జెడ్పీ)-14
- ఎల్డీఎఫ్- 10
- యూడీఎఫ్-4
మునిసిపాలిటీలు-86
- యూడీఎఫ్-45
- ఎల్డీఎఫ్-35
- ఎన్డీఏ- 4
- ఇతరులు- 2
కార్పొరేషన్లు-6
- ఎల్డీఎఫ్-3
- యూడీఎఫ్-3
డిసెంబర్ 8, 10, 14 తేదీల్లో మొత్తం 12 వందల స్థానిక సంస్థలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో 941 గ్రామ పంచాయతీలు సహా 6 కార్పొరేషన్లు, 87 మునిసిపాలిటీలు, 14 జిల్లా పంచాయతీలు ఉన్నాయి. 2015లో జరిగిన స్థానిక సంస్థల్లో అధికార ఎల్డీఎఫ్ కూటమి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోగా.. యూడీఎఫ్ రెండో స్థానంలోనూ, భాజపా మూడో స్థానంలో నిలిచాయి.