కేరళ గోల్డ్ స్మగ్లింగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు చేస్తున్న దర్యాప్తుపై న్యాయ విచారణకు ఆదేశించడం రాజ్యాంగ విరుద్ధమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. తిరువనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని అన్నారు. ఈ నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని అభిప్రాయపడ్డారు.
శబరిమల ఆలయ సంప్రదాయాలు, నియమాలను రక్షించే విధంగా చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు రాజ్నాథ్. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న కేరళ అభివృద్ధిలో ఎందుకు వెనకబడుతోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారం ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్యే కొనసాగడం ఇందుకు కారణమని అన్నారు. కేరళలో ఉగ్రవాద కేసులను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు.
బంగారం, డాలర్ స్మగ్లింగ్ కేసులను విచారిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలపై న్యాయ విచారణకు సిఫారసు చేయాలని కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్మగ్లింగ్ కేసులను విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలపై న్యాయ విచారణకు కేరళ సిఫారసు చేయనుంది. శుక్రవారం జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చూడండి: 'బంగాల్ బరి'కి దూరంగా కాంగ్రెస్ పెద్దలు- ఎందుకిలా?