KERALA COVID CASES: కేరళలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రోజువారీ కేసులు 20 వేల లోపునకు పడిపోయాయి. బుధవారం 23 వేలకు పైగా కేసులు బయటపడగా.. గురువారం ఈ సంఖ్య భారీగా క్షీణించింది. కొత్తగా 18,420 మందికి కరోనా నిర్ధరణ అయిందని అక్కడి వైద్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 63,65,051కు పెరిగింది.
Covid cases Kerala today:
మరో 341 మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేరళ వైద్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 61,134కు పెరిగింది. కొత్తగా నమోదైన మరణాల్లో 20 మంది మాత్రమే 24 గంటల వ్యవధిలో మరణించారని తెలిపింది. 168 మంది ఇటీవలే మరణించారని, వారి ధ్రువపత్రాలు ఆలస్యంగా వచ్చాయని పేర్కొంది. మిగిలిన 153 మరణాలు.. కేంద్రం, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం గుర్తించినవని వివరించింది.
యాక్టివ్ కేసుల సంఖ్య సైతం భారీగా తగ్గింది. కొత్తగా 43,286 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఫలితంగా యాక్టివ్ కేసులు 2.32 లక్షల లోపునకు పడిపోయాయి.
దేశంలోనూ తగ్గుముఖం...
మరోవైపు, దేశంలో కరోనా గణనీయంగా తగ్గుముఖం పడుతోందని కేంద్రం వెల్లడించింది. ఇదివరకుతో పోలిస్తే పరిస్థితి మెరుగైందని.. ప్రపంచవ్యాప్తంగా ఊహించిన సమయం కంటే ముందే కేసులు అదుపులోకి వచ్చాయని పేర్కొంది. జనవరి 24న దేశంలో పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉందని.. ఇప్పుడు 4.44 శాతానికి చేరిందని తెలిపింది. భారత్‌లో కరోనా స్థితిపై గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాలను వెల్లడించింది. మహమ్మారి తగ్గుముఖం పడుతున్నా వైరస్‌పై పూర్తి అవగాహన లేనందున అప్రమత్తంగా ఉండి పర్యవేక్షణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: హిజాబ్, కాషాయ దుస్తులు ధరించొద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు