కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఆస్తుల విలువ రూ.54 లక్షలని వెల్లడించారు. వీటిలో రెండు ప్లాట్లు సహా.. రూ.51.95 లక్షలు విలువైన స్థిరాస్తులున్నట్లు తెలిపారు. కన్నూర్ జిల్లా ధర్మదామ్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసిన ఆయన.. ఎన్నికల అఫిడవిట్లో ఈ వివరాలను పేర్కొన్నారు.
పినరయి చరాస్తుల వివరాలు:
- ఎస్బీఐ-తలసేరి శాఖలోని తన బ్యాంకు ఖాతాలో రూ.78 వేలు నగదు.
- మలయాళ కమ్యూనికేషన్ లిమిటెడ్‌లో రూ.10,000 విలువ చేసే 1000 షేర్లు.
- కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.లక్ష విలువైన షేర్లు.
2020-21లో వివిధ మార్గాల్లో రూ.2,87,860 ఆదాయం సమకూరినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో రెండు కేసులు పెండింగ్లో ఉన్నట్లు నామినేషన్లో పేర్కొన్న పినరయి.. వీటిలో ప్రస్తుతం ఒక కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉందని తెలిపారు.
భార్య పేరిట..
తన భార్య కమల పేరిట రూ.35 లక్షల విలువైన ఆస్తులున్నట్లు పినరయి తెలిపారు. ఎస్బీఐ-తలసేరి శాఖలోని ఆమె ఖాతాలో రూ.5,47,803 నగదు ఉందన్నారు.
ప్రతిపక్ష నేత ఆస్తులు..
కేరళ శాసనసభ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల తన ఆస్తుల విలువ రూ.1.23కోట్లుగా ప్రకటించారు. ఇందులో రూ.76లక్షల 20 వేల 620 విలువైన స్థిరాస్తులున్నట్లు వెల్లడించారు.
కేరళలోని 140 నియోజకవర్గాలకు ఏప్రిల్ 6న(ఒకే దశలో) ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చదవండి: మమతా బెనర్జీ ఆస్తుల విలువెంతో తెలుసా?