కేరళలోని మలప్పురంలో ఘోర ప్రమాదం జరిగింది. తానూరులోని కెట్టుంగల్ బీచ్ వద్ద పర్యటకుల బృందంతో వెళ్తున్న పడవ మునిగిపోవడం వల్ల 22 మంది మరణించారు. ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఘటనాసమయానికి పడవలో 25 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం.. పడవ టూరిస్ట్‌లతో కిక్కిరిసిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిసింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పడవ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి తగిన ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్.. ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు.
సీఎం సంతాపం.. సత్వర చర్యలకు ఆదేశం
ఈ ఘటన పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో అత్యవసర సహాయక చర్యలు చేపట్టాలని మలప్పురం జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు.
పెళ్లికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువులతో పెళ్లికి వెళుతున్న వ్యాన్‌ను.. వేగంగా వస్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఎనిమిది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొరాదాబాద్ జిల్లాలో భగత్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దల్పత్‌పుర్ రోడ్డు.. ఖైర్‌ఖాతా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులందరిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వారు వెల్లడించారు. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో మొత్తం 26 మంది ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు.
మృతులను రజియా (14), మునీజా (18), అనిఫా (42), హుకుమత్ (60), ముస్తఫా (25), ఆసిఫ్ (40), మహ్మద్ ఆలం (36), జుబేర్ (45)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులందరిని మొదట జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్న కారణంగా.. వారి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వారు వెల్లడించారు.
నీట్ పరీక్షకు వెళ్తూ ప్రమాదం
నీట్ పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తున్న 18 ఏళ్ల యువకుడిని ఓ ట్రక్కు ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు ఆ యువకుడు. ప్రమాదంలో మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరాన్‌పుర్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడిని రుచిత్ కాంబోజ్గా పోలీసులు గుర్తించారు. అతడు మొహల్లా దుర్గా కాలనీకి చెందిన వ్యక్తి అని వారు తెలిపారు. రుచిత్ తన స్నేహితుడితో కలిసి దేవాబాద్కు నీట్ పరీక్ష రాసేందుకు వెళుతుండగా.. సర్సావా ప్రాంతంలో ట్రక్కు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. రుచిత్ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ.. ఫలితం లేకపోయిందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని వారు పేర్కొన్నారు.