రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు ఛాన్సలర్‌గా వ్యవహరించే గవర్నర్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించే బిల్లుకు కేరళ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లు ఆమోదం పొందిందని స్పీకర్ ఏఎన్ శ్యాంసీర్ ప్రకటించారు. గవర్నర్ స్థానంలో విద్యారంగంలో నిపుణులను ఛాన్స్‌లర్‌గా నియమించనున్నట్లు బిల్లులో పేర్కొన్నారు.
అంతకుముందు, బిల్లుపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లుకు విపక్షం సైతం అనుకూలంగానే స్పందించింది. అయితే, దీనిపై పలు సవరణలు ప్రతిపాదించింది. ఛాన్స్‌లర్‌గా గవర్నర్‌కు బదులుగా ఆ స్థానంలో.. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమార్తి లేదా.. కేరళ హైకోర్టు రిటైర్డ్ సీజే ఉండాలని కోరింది. వారిని ఎంపికచేసే కమిటీలో సీఎం, ప్రతిపక్ష నేత, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని సూచించింది. అయితే, ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. దీంతో విపక్ష నాయకులు సభను బహిష్కరించారు.
న్యాయమూర్తులు ఈ ప్యానల్ కమిటీలో ఉండాల్సిన అవసరం లేదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రాజీవ్ అన్నారు. దానికంటే ఆ కమిటీలో స్పీకర్ ఉంటే మంచిదని తెలిపారు. గవర్నర్ స్థానాన్ని భర్తీ చేయడానికి రిటైర్డ్ జడ్జ్‌లు మాత్రమే ప్రత్యామ్నాయం కాదని మంత్రి అన్నారు.
కేరళలోని విజయన్ ప్రభుత్వానికి, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కు మధ్య కొంతకాలంగా వేర్వేరు అంశాలపై వివాదాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల ఉపకులపతుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. తొమ్మిది యూనివర్సిటీల వీసీలను రాజీనామా చేయాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. గవర్నర్‌కు అలా ఆదేశించే అధికారాలు లేవని సీఎం ఎదురుదాడికి దిగారు. దీనికి ప్రత్యమ్నాయంగానే కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.