కేరళకు చెందిన నటుడు, న్యాయవాది షుక్కూర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పెళ్లైన 29ఏళ్ల తర్వాత మళ్లీ రెండోసారి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన భార్యను రెండో ఈ నెల 8న మరోసారి వివాహం చేసుకోనున్నట్లు ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు తన భార్యను పెళ్లాడనున్నట్లు షుక్కూర్ తెలిపారు. ఎందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారో తెలుసా?
29 సంవత్సరాల తర్వాత మళ్లీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద తన భార్యనే షుక్కూర్ వివాహం చేసుకుంటున్నారు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం తన మరణానంతరం ముగ్గురు కుమార్తెలకు తన ఆస్తి లభించదని అందుకే తన భార్యను రెండోసారి పెళ్లి చేసుకుంటున్నానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 1994 అక్టోబర్ 6న షుక్కూర్, షీనా దంపతులకు వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు.
'నేను, నా భార్య మరణించాక కేవలం మా ఆస్తిలో మూడింట రెండు వంతులు మాత్రమే మా పిల్లలకు లభిస్తుంది. మిగతా ఆస్తి నా సోదరులకు వెళ్లిపోతుంది. ఎందుకంటే మాకు మగపిల్లలు లేరు. అందుకే ముస్లిం పర్సనల్ లా 1937 ప్రకారం నా ఆస్తిలో ఒక వంతు నా సోదరులకు చెందుతుంది. ఒక్క కొడుకు ఉన్న మా ఆస్తి మొత్తం పిల్లలకు సంక్రమించేది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులుంటాయని రాజ్యాంగం చెబుతోంది. కానీ ఇస్లాంను ఆచరించే వారు మాత్రం ఇలాంటి లింగ వివక్షతకు గురికావాల్సి వస్తుంది. ఇది చాలా బాధాకరం. నాలాగా కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉన్న వేలాది మంది ముస్లిం తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తి ఇవ్వాలంటే వారేం చేయాలి? ఆడపిల్లలకు వారు ఎలాంటి ఆస్తి భద్రతను కల్పించగలరు? ఇలా ఇబ్బంది పడుతున్న ఎంతో మంది ముస్లిం తల్లిదండ్రులకు ఒకే ఒక మార్గం. 1954న పార్లమెంట్ ఆమోదించిన ప్రత్యేక వివాహ చట్టం. దీని ద్వారా హక్కులను పొందడమే ముస్లింలకు ఉన్న ఏకైక మార్గం. దీని ద్వారానే ముస్లింలు పర్సనల్ లాను అతిక్రమించి ఆడపిల్లలకు పూర్తి ఆస్తి భద్రతను కల్పించగలరు' అని షుక్కూర్ ఫేస్బుక్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
మహిళా దినోత్సవం రోజున రెండోసారి పెళ్లి
1954 ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్న వారి హక్కులను ముస్లిం లా ఏమాత్రం ప్రభావితం చేయలేదని షుక్కూర్ అన్నారు. '1994 అక్టోబర్ 6న షీనాను పెళ్లి చేసుకున్నాను. ప్రస్తుతం స్పెషల్ మ్యారెజ్ యాక్ట్ లోని సెక్షన్ 15 ప్రకారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున(మార్చి 8న) మరోసారి వివాహం చేసుకోబోతున్నా. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నా పెళ్లి జరగబోతోంది.' అని షుకూర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.