ఉగ్రవాదం కేసులో చేయని నేరానికి 12 ఏళ్లు శిక్ష అనుభవించిన అనంతరం కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి జైలు నుంచి విడుదలయ్యాడు. బషీర్ అహ్మద్ బాబా(44)ను నిర్దోషిగా తేల్చుతూ అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద నమోదైన అభియోగాలన్నింటినీ కోర్టు కొట్టివేయగా.. బషీర్ బాబా తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. 12 ఏళ్ల నుంచి నమ్మకాన్ని కోల్పోకుండా పోరాడి.. చివరకు తాను నిర్దోషినని నిరూపించుకున్నాడు.
యువతకు శిక్షణనిస్తున్నాడని..
శ్రీనగర్‌లో తన ఇంటి సమీపంలోనే బషీర్ ఓ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ను నడుపుతుండేవాడు. ఓ స్వచ్ఛంద సంస్థకు అసిస్టెంట్ మేనేజర్‌గా కూడా పనిచేసేవాడు. 2010 ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌లో వర్క్‌షాప్ కోసం కశ్మీర్‌ను విడిచి వెళ్లాడు. పని ముగించుకుని సొంతూరికి వెళ్లాలనుకునేలోపే గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తి అని ఆరోపించారు. యువతను ఉగ్రవాద కార్యకలాపాలకు సన్నద్ధం చేస్తున్నాడని అభియోగాలు మోపుతూ అరెస్టు చేశారు.
బషీర్ బాబా జైల్లో ఉండగానే అతని తండ్రి, మామతో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులను కోల్పోయాడు. 2017లో బషీర్ తండ్రి క్యాన్సర్‌తో చనిపోయాడు. విడుదలయ్యే వరకు ఆ విషయం తెలియకుండానే జైల్లో మగ్గాల్సి వచ్చింది బషీర్ బాబాకు.
టీచర్ కావాలని..
జైల్లో చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నా.. బషీర్ ఏనాడూ అత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. నిర్దోషినని నిరూపించుకోవడానికి అనుక్షణం ప్రయత్నించాడు. జైల్లో ఉండగానే చదువును కొనసాగించాడు. మూడు పీజీలు పూర్తి చేశాడు. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్ సబ్జెక్టుల్లో పట్టా పొందాడు. ఇప్పుడు టీచర్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
"జైల్లో ఎక్కువ సమయాన్ని చదువుపైనే వెచ్చించేవాడిని. ఏదో ఒక రోజు తప్పకుండా విడుదలవుతానన్న నమ్మకం ఉండేది. నా తరఫున వాదించిన న్యాయవాది జావెద్ పఠాన్‌కు ధన్యవాదాలు. నాకు చాలాకాలం నుంచి మద్దతుగా నిలిచారు. నా కుటుంబ పేదరికం చూసి ఆయన డబ్బులు కూడా తీసుకోలేదు. దేశంలో నిరుద్యోగం, అత్మహత్యలు, హింస విపరీతంగా పెరిగినట్లు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత విన్నాను. చాలా బాధాకరంగా ఉంది."
-బషీర్ బాబా
"ప్రతిరోజూ దేవున్ని వేడుకునేదాన్ని. నా కుమారుడి అరెస్టు తర్వాత మా కుటుంబం చాలా ఇబ్బందులకు గురైంది. ఆ సమయంలో పెళ్లి చేయాల్సిన ఇద్దరు ఆడబిడ్డలు ఇంట్లో ఉన్నారు. నా భర్త క్యాన్సర్‌తో కన్నుమూశారు. అన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది."
-బషీర్ బాబా తల్లి
"నా సోదరీమణుల పెళ్లిళ్లు చేశాము. అన్న అరెస్టు, తండ్రి మరణం తర్వాత అంతా మారిపోయింది. చిన్న వస్త్ర దుకాణం నడుపుతూ కుటుంబ పోషణను నెట్టుకొచ్చాను. అన్నయ్య కోసం ఎదురుచూశాము. అతను అమాయకుడని నాకు తెలుసు. దేవుడి మీదే భారం వేశాము ఇన్నాళ్లు."
-బషీర్ బాబా సోదరుడు
ఇవీ చదవండి:ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య