జమ్ముకశ్మీర్ లోయలో ఈసారి భద్రతా బలగాలకు మిశ్రమ ఫలితాలు అందాయి. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ ఉగ్రవాదులను దేశంలోకి చొరబడకుండా అడ్డుకోవడంలో భారత సైన్యం ఎన్నో విజయాలను నమోదు చేసింది. కానీ, స్థానిక కశ్మీరీలే.. అధికంగా ఉగ్రవాదానికి ఆకర్షితులవడం ఆందోళన కలిగిస్తోంది. 2020లో భద్రతా బలగాల చేతిలో 226 మంది ముష్కరులు హతమయ్యారు. అయితే.. వీరిలో 176 మంది(78శాతం) స్థానికులే ఉండడం గమనార్హం. మిగతా 50 మంది విదేశీ ఉగ్రవాదులు. స్థానికుల్లో పెరుగుతున్న అసంతృప్తే.. వారిని ముష్కరులతో జత కట్టేలా చేస్తోందని తెలుస్తోంది.
ఉగ్రవాదంలో ఏ ఏడాది ఎంతమంది స్థానికులు కలిశారు?
ఏడాది | సంఖ్య |
2015 | 66 |
2016 | 88 |
2017 | 128 |
2018 | 191 |
2019 | 119 |
కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టే దిశగా భారత సైన్యం గట్టి చర్యలు చేపట్టింది. పోలీసులతో, పారా బలగాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి కచ్చితమైన ప్రణాళికలు రచిస్తోంది. వీటితో పాటు డ్రోన్ల వంటి అధునాతన సాంకేతిక పర్యవేక్షణ, మానవ మేథస్సుతో ఉగ్రవాదానికి దీటైన సమాధానమిస్తోంది.
స్థానికులు ఎందుకు ఆకర్షితులవుతున్నారు?
2019, ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్లో స్థానిక రాజకీయ పార్టీల జోక్యం బాగా తగ్గిపోయింది. ఇది స్థానిక యవతలో అసంతృప్తికి దారితీసింది. ఇలాంటి వారిలో ముష్కర సంస్థలు ఉగ్రవాద బీజాలు నాటుతున్నాయి. భద్రతా బలగాల చేతిలో ఈ ఉగ్రవాదులు హతమైనప్పుడు కశ్మీర్లోని స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యేలా చేస్తోంది. ఫలితంగా.. మరింత ఎక్కువ మంది ముష్కరులతో చేతులు కలుపుతున్నారు.
ఎందుకు ఎక్కువ మంది చనిపోతున్నారు?
గత ఐదేళ్లుగా ఉగ్రవాదుల్లో చేరే స్థానికల సంఖ్య ఎంతలా పెరుగుతోందో.. అదే స్థాయిలో భద్రతా బలగాల చేతిలో మరణించే ముష్కరుల సంఖ్య నమోదవుతోందని సైనిక గణాంకాలు చెబుతున్నాయి. 2020లో దాదాపు 226 మంది ఉగ్రవాదులు హతమవగా.. వీరిలో చాలా మంది స్థానికులే ఉన్నారు. ముష్కర కూటముల్లో చేరిన వీరికి సరైన శిక్షణ ఇవ్వకుండా, భావోద్వేగాలను రెచ్చగొడుతూ భద్రతా బలగాల మీదకు ఉగ్రవాద సంస్థలు ఉసిగొల్పుతున్నాయి. ఫలితంగా.. చనిపోయే వారి సంఖ్యా ఎక్కువవుతోంది. దానితో పాటు సైనిక బలగాలు తీసుకుంటున్న పటిష్ఠ చర్యలు ఇందుకు కారణమవుతున్నాయి.
కశ్మీర్లో ఈ ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోవడానికి ప్రధాన అడ్డంకులేంటి?
పరిస్థితులకు తగ్గట్టుగా తమ స్థావరాలను మార్చుతూ ఉండే.. ఈ ముష్కరులను గుర్తించడం సైనిక బలగాలకు ప్రధాన సమస్యగా నిలుస్తోంది. ఒంటరిగా దాడులకు దిగే (లోన్ వోల్ఫ్ అటాక్స్) అవకాశం ఉన్నందున ఈ మిలిటెంట్లను అరెస్టు చేయడం లేదా నిరోధించడం క్లిష్టంగా మారుతోంది.
త్రిముఖ వ్యూహాన్ని అనుసరించాలి...
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం త్రిముఖ వ్యూహంపై దృష్టి పెట్టడం అత్యంత అవసరం. ఉగ్రవాదం నుంచి బయటకు వచ్చినవారికి లేదా పట్టుబడిన వారికి సరైన పునరావాసం కల్పించాలి. 2020లో తొమ్మిది మంది ముష్కరులు పట్టుబడ్డారు. 55 మందిని అరెస్టు చేశారు. అలాంటి వారిలో మానసికంగా మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి. వారి వల్ల మిగతా ఉగ్రవాదులకూ తమ సిద్ధాంతాలను వీడే అవకాశం లభిస్తుంది.
కశ్మీర్ వాసులకు తగినన్ని ఉపాధి అవకాశాలను కల్పించాలి. రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యమివ్వాలి. ఈ చర్యల ఫలితంగా కశ్మీర్లో ఉగ్రవాదాన్ని నిరోధించవచ్చు.
"అసంతృప్త వర్గాలను ఎలా దారిలోకి తెచ్చుకున్నామన్న అంశాల ఆధారంగానే.. ఏ దేశ విజయాలైనా, అపజయాలైనా ఆధారపడి ఉంటాయి. కశ్మీర్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ." అని దిల్లీ విశ్వవిద్యాలయ చరిత్ర బోధకుడు సంజయ్ కుమార్ సింగ్ చెప్పిన మాటలు ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
- సంజీవ్ కే బారువా
ఇదీ చూడండి:లోయలో పెరుగుతున్న ఉగ్రవాదం- వారానికి ఐదుగురు హతం!