తన ఊరిని వేధిస్తున్న నీటి సమస్య.. ఓ యువకుడి వివాహానికి అడ్డంకిగా మారింది. అతడి ఇంటిని చూసేందుకు వచ్చిన వధువు కుటుంబం.. ఆ ఊరి నీటి కష్టాలను చూసి కంగుతింది. దాంతో ఆ పెళ్లి వద్దనుకుని అటునుంచటే వెనుదిరిగి వెళ్లిపోయింది. ఈ సంఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో(Karnataka Davanagere News) జరిగింది.
దావణగెరె జిల్లా(Karnataka Davanagere News) మలెబెన్నూర్ పట్టణానికి చెందిన ఓ యువకునికి.. హరిహరా తాలుకాలోని బానుహల్లీ గ్రామానికి చెందిన యువతితో కొద్ది రోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది. వధువు కుటుంబ సభ్యులు... మలెబెన్నూర్లోని వరుడి ఇంటిని చూసేందుకు వచ్చారు. అయితే.. మార్గమధ్యలో బీరలింగేశ్వర దేవాలయాన్ని వారు దర్శించుకున్నారు. అక్కడ నుంచి వరుడి ఇంటికి వస్తున్న క్రమంలో.. కొంతమంది మహిళలు తాగునీటి కోసం గొడవ పడుతున్న దృశ్యం వారి కంటపడింది.
15 రోజులకొకసారి సరఫరా అయ్యే నీటి కోసం ఆ మహిళలు గొడవపడుతున్నారని తెలుసుకుని వధువు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తమ బిడ్డను ఆ ఊరికి పంపి ఆ నీటి కష్టాల్లో పడేయకూడదని భావించారు. దాంతో ఇక పెళ్లికొడుకు ఇంటిని చూడకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.
"వరుడి కుటుంబం మా ఊరికి వచ్చినప్పుడు కొంతమంది మహిళలు.. గొడవపడుతుండటాన్ని చూశారు. ఆ తర్వాత వారిని మేం మా బంధువుల ఇంటికి తీసుకువెళ్లాం. పెళ్లి గురించి అడిగాం. కానీ దాని గురించి వారు ఏమీ మాట్లాడలేదు. ఇంటికి వెళ్లాక తాము దీని గురించి తెలియజేస్తాం అని చెప్పారు. ఇప్పటికే 15 రోజులు పూర్తయ్యాయి. కానీ, వారి దగ్గరి నుంచి ఏ సమాధానం లేదు. దాంతో మేం మ్యారేజ్ బ్రోకర్‌ను సంప్రదించాం. నీటి సమస్య ఉన్నందున ఈ పెళ్లికి వారు అంగీకరించలేదని అతడు మాతో చెప్పాడు. ఈ కష్టాల్లోకి తమ కూతురిని వారు పంపించడానికి సిద్ధంగా లేరు."
- హలేశప్ప, వరుడి బంధువు
రెండేళ్లుగా తాము ఈ నీటి కష్టాలను ఎదుర్కొంటున్నామని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్య వల్ల తమ ఊరి యువకులతో పెళ్లి సంబంధాలను కలుపుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపట్లేదని ఆవేదన చెందుతున్నారు.
"రెండేళ్లుగా మేం నీటి కష్టాలను ఎదుర్కొంటున్నాం. ఈ రెండు మూడు నెలలుగా ఈ సమస్య మరీ ఎక్కువైపోయింది. 15 నుంచి 20 రోజులకొకసారి మాకు నీళ్లు సరఫరా అవుతాయి. అంతేగాకుండా వచ్చినా అర్ధరాత్రి పూట వస్తుంటాయి. మనుషులు బతకాలంటేనే నీళ్లు చాలా అత్యవసరం. అలాంటి నీళ్లే మాకు దొరక్కపోతే... మేం ఏమవ్వాలి?"
- గంగాధర్, స్థానికుడు
ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ఊరికి నీటి కష్టాలను తొలగించాలని వారు కోరుతున్నారు.
ఇదీ చూడండి: ఐవీఎఫ్ పద్ధతిలో లేగదూడ జననం- దేశంలోనే తొలిసారి!
ఇదీ చదవండి: చదువుకునేందుకు డబ్బులు లేకే చనిపోతున్నా..