కర్ణాటకలో మరో పేలుడు ఘటన కలకలం సృష్టించింది. హసన్ జిల్లాలో ఓ కొరియర్ షాపులో ఉన్న మిక్సీ పేలి యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సోమవారం రాత్రి 7:30 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మిక్సీని మరో చోటుకు రవాణా చేస్తుండగా పేలడం వల్ల తొలుత పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
రెండు రోజుల క్రితం డీటీడీసీ కొరియర్‌కు వచ్చిన పార్శిల్‌ను నగరంలోని ఓ వ్యక్తికి డెలివరీ చేశారు. అయితే రెండు రోజుల తర్వాత ఆ వ్యక్తి ఈ కొరియర్ తనది కాదని తిరిగి డీటీడీసీ వారికి అందించాడు. ఆ తర్వాత కొరియర్ ఆఫీస్‌లో ఆ మిక్సీ పేలింది. దీంతో యుజమాని శశి కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. కార్యాలయంలోని వస్తువులు దెబ్బతిన్నాయి. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్పీ హరిరామ్ శంకర్.. గాయపడిని వ్యక్తికి పెద్దగా ప్రమాదమేమీ లేదని తెలిపారు.
అయితే, ఈ ఘటన వెనక ఉగ్ర కోణం లేదని ఎస్పీ హరిరామ్ శంకర్ వివరణ ఇచ్చారు. వ్యక్తిగత కక్షలే ఈ ఘటనకు కారణమని తెలిపారు. 'పార్సిల్ తీసుకోవాల్సిన వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని ఈ ప్లాన్ చేశారు. ఉగ్రవాదులు ఉపయోగించే పేలుడు పదార్థాలు, సాంకేతికత ఇక్కడ దొరకలేదు. ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల వల్ల ఇంత భారీ పేలుడు సాధ్యం కాదు. మైసూర్ నుంచి ఫోరెన్సిక్ టీమ్ వచ్చి నమూనాలు పరిశీలించింది. కొరియర్‌ను తిరిగిచ్చిన వ్యక్తిని, పార్సిల్ పంపిన వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నాం. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. ప్రజలు వదంతులను నమ్మొద్దు' అని ఎస్పీ వివరించారు. మాజీ గర్ల్‌ఫ్రెండ్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికే ఓ వ్యక్తి బెంగళూరు నుంచి మిక్సీని పంపించాడని ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు.
ఇటీవలే మంగళూరు పోలీస్ స్టేషన్ సమీపంలో వెళ్తున్న ఆటోలో ఉన్న ప్రెజర్ కుక్కర్ ఒక్కసారిగా పేలింది. పెద్దఎత్తున మంటలు చెలరేగి.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడితోపాటు ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. రోడ్డుపై వెళ్తున్న ఆటోలో పేలుడుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ కుక్కర్ పేలుడు ఓ ఉగ్రదాడిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో మిక్సీ పేలుడుపైనా అలాంటి అనుమానాలే వ్యక్తమయ్యాయి.