పాఠశాలకు రాలేదని బాలికలతో మరుగుదొడ్లు శుభ్రం చేయించింది ఓ ఉపాధ్యాయురాలు. ఈ ఘటన కర్ణాటక గదగ జిల్లాలోని నాగవి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. వీరందరు 7వ తరగతి చదువుతున్న బాలికలు. అంతకముందు 6వ తరగతి విద్యార్థులతో కూడా మరుగుదొడ్లు శుభ్రం చేయించినట్లు విద్యార్థులు తెలిపారు. ఈ దారుణాన్ని పాఠశాల వంట మనిషి విజయలక్ష్మి వీడియో తీశారు. ఈ విషయం ఉన్నతాధికారులకు దృష్టికి చేరింది. వారు పాఠశాలలోని బాలికలను ప్రశ్నించగా జరిగిన విషయమంతా చెప్పారు.
"టాయిలెట్స్ శుభ్రంగా లేవు. వాటిని శుభ్రం చేయమని టీచర్ ఆదేశించారు. ఐదుగురు బాలికలు వెళ్లి శుభ్రం చేశాం. మరుగుదొడ్డి శుభ్రం చేయకపోతే టీచర్ మమ్మల్ని కొడతారు. కాబట్టి మా టీచర్ చెప్పినట్లే చేయాలి. ఈ విషయాన్ని అధికారులకు చెబితే కొడతానని భయపెట్టారు."
-విద్యార్థిని
"విద్యార్థులు మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న దృశ్యాలను నా ఫోన్లో తీశాను. అలా చేసినందుకు ఉపాధ్యాయులు, అధికారులు నాపై విరుచుకుపడ్డారు. మీరు చేయాల్సింది వంట మాత్రమే. ఆ పని చేయండి చాలు. లేకపోతే మీరు ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది. మీరేమీ డాన్ కాదని నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు."
-వంట మనిషి, విజయలక్ష్మి
రోల్ కాల్ చెప్పలేదని.. హాజరు చెప్పలేదని 7వ తరగతి విద్యార్థి కిషన్ లాల్ జోషిపై ఓ టీచర్ దారుణంగా ప్రవర్తించాడు. విద్యార్థికి వీపు మీద వాతలొచ్చేలా చితకబాదాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పాడు కిషన్‌లాల్. మరుసటి రోజు పాఠశాలకు వెళ్లగా టీచర్ సెలవులో ఉన్నారని సిబ్బంది తెలిపారు. దీంతో వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తమ బిడ్డను కిరాతకంగా కొట్టిన టీచర్‌పై చర్యలు తీసుకోకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: 'కాంవడ్' యాత్రికులను ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు దుర్మరణం