Karnataka Police Dog Tara : కర్ణాటకలో ఓ హత్య కేసు నిందితుడిని పోలీసులకు పట్టించింది ఓ శునకం. ఎనిమిది కిలోమీటర్లు పరుగెత్తికెళ్లి నిందితుడు ఉన్న ఇంటిని గుర్తించింది. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే..
Davanagere Murder Case : ఆగస్టు 7న దావణగెరె సమీపంలోని మల్లశెట్టిహళ్లిలో ఓ హత్య జరిగింది. పాతకక్షల కారణంగా నరసింహుడు అనే వ్యక్తిని శివయోగేశ్ దారుణంగా చంపాడు. అనంతరం ఘటనాస్థలి నుంచి పరారై అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. హత్య జరిగిన ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు. నిందితుడిని గుర్తించేందుకు లేడీ సింగంగా పిలిచే 'తార' అనే పోలీస్ డాగ్ సాయం తీసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న తార.. హత్య జరిగిన ప్రదేశం నుంచి రామనగర వరకు దాదాపు 8 కి.మీ దూరం పరిగెత్తింది. అక్కడ ఓ ఇంటి ముందు ఆగడం వల్ల వెంటనే పోలీసు సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ ఇంటిని తనిఖీ చేయగా.. హత్య కేసు నిందితుడు యోగేశ్ అందులో ఉన్నాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడు.
"ఆగస్టు 7న దావణగెరెలో హత్య జరిగింది. ఆ హత్య కేసులో నిందితుడిని గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్ బృందం ఘటనాస్థలికి చేరుకుంది. డాగ్ స్క్వాడ్ బృందం తీసుకొచ్చిన 'తార' అనే శునకం .. 8 కిలోమీటర్లు పరిగెత్తి రామనగరలో నిందితుడు ఉన్న ఇంటిని గుర్తించింది. నిందితుడిని పోలీసులు పట్టుకోవడంలో తార కీలకపాత్ర పోషించింది. అంతకుముందు.. బాంబు, గంజాయి కేసు నిందితులను పట్టించింది తార. ఇప్పుడు హత్య కేసు నిందితుడిని పోలీసులకు పట్టించింది.
--కే.అరుణ్, దావణగెరె ఎస్పీ
6నెలల కిందట తారను దావణగెరె పోలీసులకు ఓ ప్రైవేట్ బస్సు యజమాని బహుమతిగా ఇచ్చాడు. ఇది బెల్జియన్ మెనోలీస్ జాతికి చెందిన శునకం. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో పరుగెత్తుతుంది. చాలా తెలివైనది కూడా. బెంగళూరులోని ఆడుగోడి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ఆరు నెలలు శిక్షణ పొందింది. ఈ జాతి కుక్కలను ఇండియన్ ఆర్మీ కూడా ప్రస్తుతం ఉపయోగిస్తోంది. 2018 నుంచి కర్ణాటక పోలీసులు కూడా బెల్జియన్ మనోలీస్ జాతి శునకాలను డాగ్ స్క్వాడ్ బృందంలో చేర్చారు.
వీరశునకం 'జూమ్' మృతి పట్ల ప్రముఖుల సంతాపం.. నివాళులు అర్పించిన ఆర్మీ అధికారులు