కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ మంగళవారం ఇంటి వద్దే కొవిడ్ టీకా తీసుకున్న నేపథ్యంలో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రికి వెళ్లకుండా పాటిల్(64), ఆయన సతీమణి.. హవేరి జిల్లా హిరేకెరూర్లోని తమ సొంత ఇంటివద్ద టీకా తీసుకోవడంపై ఆరోగ్యమంత్రి కే సుధాకర్, ఇతర నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన రెండో రోజు పాటిల్ టీకా తీసుకున్నారు. ఆయనపై వస్తోన్న విమర్శలను తిప్పికొట్టారు.
"నేను ఎవరికైనా హాని చేశానా? లేదా దొంగతనం చేశానా? ఆసుపత్రికి వెళ్తే ప్రజలు నా వళ్ల ఇబ్బంది పడతారని ఆలోచించి ఇంటి దగ్గరే టీకా తీసుకున్నా. ఇందులో తప్పేముంది. ఇదేం నేరం కాదు."
-బీసీ పాటిల్, కర్ణాటక వ్యవసాయ మంత్రి.
దీనిపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప.. ఎక్కడ తీసుకున్నారు అనే దానికంటే టీకా తీసుకున్నారా లేదా అనేది చాలా ముఖ్యమని అన్నారు.
నివేదిక అడిగిన కేంద్రం
పాటిల్.. ఆసుపత్రికి వెళ్లకుండా ఇంటివద్దే కొవిడ్ టీకా తీసుకున్న వివరాలను సమర్పించమని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్రం వెల్లడించింది.
ఇదీ చదవండి:70 ఏళ్లు దాటిన చెట్లకు పింఛన్- ఎందుకంటే?