కర్ణాటక, కేరళ మధ్య ఏళ్లుగా సాగుతోన్న ఆర్టీసీ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఏడేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటంలో కేరళనే విజయం వరించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సంక్షిప్తనామం - కేఎస్ఆర్టీసీని వాడుకునేందుకు కేరళకే హక్కు ఉందని స్పష్టం చేసింది ట్రేడ్మార్క్ రిజిస్ట్రీ. 1999- ట్రేడ్మార్క్స్ చట్టం ప్రకారం.. ఇప్పుడు కేఎస్ఆర్టీసీ పేరు, లోగో.. కేరళకు మాత్రమే చెందుతాయని వెల్లడించింది.
ఈ వ్యవహారంలో కేరళపై 2014లో ఫిర్యాదు చేసింది కర్ణాటక. ట్రేడ్మార్క్ రిజిస్ట్రీ ప్రకారం.. తామే మొదట కేఎస్ఆర్టీసీ పేరును ఉపయోగించినట్లు నిరూపించింది కేరళ ప్రభుత్వం. దీనికి అనుగుణంగానే.. ఆ రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు వెలువడింది.
ఇప్పటినుంచి తమ పేరును వాడొద్దని.. త్వరలో కర్ణాటక రోడ్డు రవాణా సంస్థకు సమాచారం అందించనున్నట్లు తెలిపారు కేఎస్ఆర్టీసీ ఎండీ బిజు ప్రభాకర్. దీనిని ఉల్లంఘిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్పందించిన డిప్యూటీ సీఎం..
ట్రేడ్మార్క్ రిజిస్ట్రీ తీర్పుపై స్పందించారు కర్ణాటక ఉపముఖ్యమంత్రి, రవాణా మంత్రి ఎల్ఎస్ సావడి. తీర్పు అధికారికంగా ప్రకటించిన అనంతరం.. తాము న్యాయపోరాటంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఇదీ చూడండి: కర్ణాటకలో భారీగా దొంగ నోట్లు స్వాధీనం