గత కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గానూ పెళ్లి మండపాల్లో మార్షల్స్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రజలు కొవిడ్ మార్గదర్శకాలు పాటించేలా వేడుకల వద్ద మార్షల్స్‌ను నియమించనున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డా. కె. సుధాకర్ వెల్లడించారు. వివాహాది శుభకార్యాలు, ఇతర సమావేశాల్లో 500 మంది కంటే ఎక్కువ మందిని అనుమతించేది లేదని, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఆయన సూచించారు.
మరోవైపు వైరస్ వ్యాప్తి దృష్ట్యా కలబుర్గి జిల్లా యంత్రాంగం ప్రయాణ మార్గదర్శకాలు జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు వచ్చేవారు తప్పనిసరిగా ఆర్‌టీ-పీసీఆర్ నెగెటివ్ పత్రాన్ని చూపించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం సరిహద్దుల్లో ఐదు చెక్‌పాయింట్లు ఏర్పాటు చేసింది. ఇతర సరిహద్దు ప్రాంతాల్లోనూ ఇదే నిబంధనలు అమలు చేస్తున్నారు.
కర్ణాటక సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కేరళలో కరోనా మళ్లీ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కర్ణాటకలో ఆదివారం 413 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,48,149కి చేరింది. ఇప్పటివరకు 12,294 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 6,036 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చూడండి: 'ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలో బలగాల మోహరింపు'