Karnataka CM Emotional: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం తన సొంత నియోజకవర్గం షిగ్గౌన్ ప్రజలతో భావోద్వేగపూరితంగా మాట్లాడారు. ఈ ప్రపంచంలో పదవులు, అధికారాలు సహా ఏదీ శాశ్వతం కాదని ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. బొమ్మై వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
"ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ జీవితం ఎప్పటికీ ఉండదు. మనం ఇలా ఎంతకాలం ఉంటామో ఎవరికీ తెలియదు. ఈ పదవులు, అధికారాలు కూడా శాశ్వతం కావు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని నేను ఎల్లప్పుడూ నడుచుకుంటాను."
-బసవరాజ్ బొమ్మై, కర్ణాటక సీఎం
Basavaraj bommai in his constituency: తాను బసవరాజ్‌ను మాత్రమేనని ముఖ్యమంత్రి కాదని బొమ్మై పేర్కొన్నారు. షిగ్గౌన్లో కిట్టూర్ రాణి విగ్రహాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. "ఈ ప్రాంతంలో కాకుండా బయట నేను గతంలో హోంమంత్రి, సాగునీటి శాఖ మంత్రిగా పని చేశాను. కానీ, నేను ఎప్పుడు ఇక్కడకు వచ్చినా బసవరాజ్‌ను మాత్రమే. ఎందుకంటే పదవుల కంటే బసవరాజ్ మాత్రమే శాశ్వతంగా ఉంటారు" అని బొమ్మై పేర్కొన్నారు.
Karnatka cm change: తన నియోజకవర్గ ప్రజలు ఆప్యాయంగా రొట్టె, కొర్రల అన్నం తనకు తినిపించిన సందర్భాన్ని బసవరాజ్ బొమ్మై గుర్తు చేసుకున్నారు. "గొప్ప విషయాలు చెప్పడానికి నా దగ్గర ఏమీ లేవు. మీరు ఆశించినట్లుగా నేను బతికితే అదే చాలు. మీ ప్రేమ, నమ్మకం కంటే గొప్పదైన అధికారం ఏదీ లేదు అని నేను నమ్ముతాను." అని ఆయన చెప్పారు. భావోద్వేగపూరితంగా మాట్లాడాలని తాను అనుకోలేదని.. కానీ, ప్రజలను చూడగానే తాను భావోద్వేగంగా మారానని చెప్పారు. అన్ని వర్గాల డిమాండ్లను నెరవేర్చే బాధ్యత తనపై ఉందని అన్నారు. ప్రతి క్షణం, ప్రతి చర్యలో తాను మనస్సాక్షిగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు.
బసవరాజ్ బొమ్మై మోకాలి సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని సమాచారం. అయితే.. దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
ఇదీ చూడండి: 'పటేల్ జీవించి ఉంటే ముందుగానే గోవాకు స్వాతంత్య్రం'
ఇదీ చూడండి: 'సీఎం నా ఫోన్ ట్యాప్ చేసి వింటున్నారు!'