Karnataka cm change: కర్ణాటకలో నాయకత్వ మార్పు జరగనుందని.. సీఎంగా బసవరాజ్ బొమ్మై స్థానంలో భాజపా అధిష్ఠానం మరొకరిని నియమించనుందనే ఊహాగానాలు కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. వీటికి.. ఇటీవల తన నియోజకవర్గ ప్రజలనుద్దేశించి బొమ్మై భావోద్వేగంగా మాట్లాడడం.. మరింత బలాన్ని చేకూర్చింది. ఈ నేపథ్యంలో బసవరాజ్ బొమ్మై శనివారం కీలక ప్రకటన చేశారు. తాను రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. హుబ్లీలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
"నేను విదేశాలకు వెళ్లడం లేదు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి వచ్చే ప్రసక్తే లేదు. దావోస్‌లో జరగాల్సిన కార్యక్రమం జూన్‌కు వాయిదా పడింది. కాబట్టి నాకు విదేశాలకు వెళ్లే ఆలోచన లేదు."
-బసవరాజ్ బొమ్మై, కర్ణాటక ముఖ్యమంత్రి.
Karnatka Leadership change news: కర్ణాటకలో నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక భాజపా అధ్యక్షుడు నలిన్ కుమార్ కతీల్ సైతం కొట్టిపారేశారు. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగేవరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై కొనసాగుతారని వారు పేర్కొన్నారు. గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప రాజీనామా చేయనున్నారని ఊహాగానాలు వచ్చినప్పటికీ.. ఆయన రెండేళ్లపాటు పదవిలోనే కొనసాగారని నళిన్ కుమార్ కతీల్ పేర్కొన్నారు.
"బొమ్మై రాజీనామా చేయనున్నారనే వార్తలన్నీ ఊహాగానాలు మాత్రమే. ఇది రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం సృష్టించడానికి, భాజపా ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రగా భావిస్తున్నాను. ఈ పుకార్ల వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంటుందని నా అనుమానం."
-నళిన్ కుమార్ కతీల్, కర్ణాటక భాజపా అధ్యక్షుడు
తన మోకాలి చికిత్స కోసం విదేశాలకు బొమ్మై వెళ్లనున్నారనే వార్తను నళిన్ కుమార్ తోసిపుచ్చారు. "బసవరాజ్ బొమ్మై విదేశాలకు వెళ్లడం లేదు. ఆయన కాలికి సమస్యలు మినహా ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. దానికి ఇక్కడే చికిత్స అందుతోంది. ఆయన ఇక్కడే కోలుకుంటారు" అని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఆయన విదేశాలకు వెళ్లాల్సి ఉండేది.. కానీ, అది వాయిదా పడిందని చెప్పారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా సీఎం మార్పుపై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు. "2023 వరకు బసవరాజ్ బొమ్మై.. కర్ణాటక సీఎంగా ఉంటారని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఆయన నేతృత్వంలో భాజపా ప్రభుత్వం కర్ణాటకలో బాగా పని చేస్తోంది. నాయకత్వం మారుతుందని ప్రచారం చేయడం చాలా తప్పు" అని చెప్పారు.
ఇటీవల తన సొంత నియోజకవర్గం షిగ్గౌన్కు వెళ్లిన సీఎం బసవరాజ్ బొమ్మై అక్కడ భావోద్వేగపూరితంగా మాట్లాడారు. 'ఈ ప్రపంచంలో పదవులు, అధికారాలు సహా ఏదీ శాశ్వతం కాద'ని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: 22 రైతు సంఘాల రాజకీయ వేదిక- అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ
ఇదీ చూడండి: ఆ రికార్డులు నాశనం చేసేందుకే.. కోర్టులో బాంబు దాడి!