Karnataka Assembly : కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై సహా 93 మంది ఎమ్మెల్యేలు శాసనసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
అసెంబ్లీకి ఎద్దులబండిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే
కాంగ్రెస్కు చెందిన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో కర్ణాటక అసెంబ్లీకి వచ్చారు. మండ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ గనిగతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు ఎద్దులబండిపై విధానసౌధకు చేరుకున్నారు. అసెంబ్లీలో అందరి దృష్టిని ఆకర్షించారు. రాష్ట్రంలో రైతుల అనుకూల ప్రభుత్వం ఏర్పడినందుకు ప్రతీకగా ఎద్దులబండిపై అసెంబ్లీకి వచ్చినట్లు తెలిపారు.
అసెంబ్లీ ఎదుట డీకే సాష్టాంగ నమస్కారం
అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్.. విధానసౌధ మెట్లపై సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం లోపలకు ప్రవేశించారు. అందుకు సంబంధించిన చిత్రాన్ని ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను మర్యదపూర్వకంగా కలిశారు డీకే.
గోమూత్రంతో అసెంబ్లీ ప్రాంగణం పవిత్రం!
కర్ణాటక అసెంబ్లీ సమావేశాల తొలిరోజు.. విధానసౌధ ప్రాంగణాన్ని గోమూత్రంతో శుభ్రం చేయించి పూజలు చేయించారు కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీ ప్రవేశ ద్వారం, బయట ప్రాంగణంలో కేపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.మనోహార్.. అర్చకులతో పూజలు నిర్వహించారు. "కాంగ్రెస్ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం విధానసౌధ ముందు ప్రత్యేక పూజలు చేసి.. ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశాం" అని ఆయన తెలిపారు.
ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్ ఆర్వీ దేశ్‌పాండే
Siddramaiah DK Shivakumar : సోమవారం ఉదయం జాతీయ గీతం వందేమాతరంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ ఆర్వీ దేశ్‌పాండే కొత్త శాసనసభ్యుల ప్రమాణ స్వీకారానికి అనుమతించారు. ఆ తర్వాత అసెంబ్లీ కార్యదర్శి ఎంకే విశాలాక్షి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సిద్ధరామయ్య భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేశారు. కనకాపురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన డీకే శివకుమార్ గంగాధరయ్య అజ్జయ్య సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అధికార, ప్రతిపక్ష సభ్యులకు అభినందనలు తెలిపారు.
డీకే పేరిట ప్రమాణ స్వీకారం
చన్నగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే బసవరాజు శివగంగ భగవాన్.. డీకే శివకుమార్ పేరిట ప్రమాణం చేశారు. కొత్తగా ఎన్నికైన భగీరథుడు కులదేవుని పేరుతో ప్రమాణస్వీకారం చేశారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్న దర్శన్ పుట్టన్నయ్య రాజ్యాంగం పేరుతో, దర్శన్ ధ్రువ నారాయణ్ రాజ్యాంగం పేరుతో ప్రమాణం చేశారు.
తండ్రీకొడుకులు పక్కపక్కనే
జేడీఎస్ నుంచి ఎన్నికైన జీటీ దేవెగౌడ, ఆయన కుమారుడు హరీశ్‌గౌడ్‌లు అసెంబ్లీలో పక్కపక్కనే కూర్చుని స్నేహితుల్లా మాట్లాడుకున్నారు. చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి జీడీ దేవెగౌడ, హున్‌సూరు నియోజకవర్గం నుంచి హరీశ్‌గౌడలు తండ్రీకొడుకులు అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు.
ఆరోపణలను నిరూపించాల్సిందే!
బీజేపీ హయాంలో అన్ని పనులకు 40 శాతం కమీషన్ తీసుకున్నట్లు ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ.. ఆధారాలతో సహా నిరూపించాలని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై డిమాండ్ చేశారు. బీజేపీ హయాంలో జరిగినట్లు ఆరోపించిన అవకతవకలపై దర్యాప్తు జరిపి.. నిజం బయటకు పెట్టాలని ఆయన సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కోరారు. "నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. వారిని విచారించనివ్వండి. వారు (కాంగ్రెస్) 40 శాతం కమీషన్ తీసుకుంటున్నట్లు ఆరోపించారు. ఇప్పుడు ఆ ఆరోపణలపై దర్యాప్తు జరిపి సాక్ష్యాధారాలతో నిరూపించాలి" అని బొమ్మై వ్యాఖ్యానించారు.