పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ (Kapil Sibal news) మరోసారి సంస్కరణలపై గళమెత్తారు. గతేడాది ఆగస్టులో కాంగ్రెస్ నాయకత్వానికి లేఖ రాసిన నేతలు (G23 Congress) ఇప్పటికీ చర్యల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. అధ్యక్ష పదవితో పాటు సీడబ్ల్యూసీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎన్నికలపై అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం కాంగ్రెస్‌కు అధ్యక్షులు లేరని పేర్కొన్నారు సిబల్. ఇలాంటప్పుడు నిర్ణయాలన్నీ ఎవరు తీసుకుంటున్నారో తెలియదని అన్నారు. తెలిసినా.. అది తెలియని విషయం వంటిదేనని చెప్పుకొచ్చారు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో ఇలాంటి పరిస్థితులు (Punjab Congress Crisis) మంచిది కాదని తెలిపారు. జీ23 నేతలు (G23 Congress list) పార్టీని వీడే వ్యక్తులు కాదని స్పష్టం చేశారు.
"సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించాలని నా సీనియర్ సహచరులు కాంగ్రెస్ అధ్యక్షురాలిని సంప్రదిస్తారని అనుకుంటున్నా. అప్పుడే.. కాంగ్రెస్ ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉందనే విషయంపై చర్చ జరిగే అవకాశం ఉంది. సరిహద్దు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి పరిస్థితులు (Punjab Congress Crisis) ఎదురవుతున్నాయంటే.. అది కచ్చితంగా ఐఎస్ఐ, పాకిస్థాన్‌కు ప్రయోజనకరమే. పంజాబ్ చరిత్ర గురించి, అక్కడి తీవ్రవాదం గురించి మనకు తెలుసు. కాంగ్రెస్ ఇక్కడ ఐక్యమత్యంగా ఉండాలి.
మేం (జీ23 నేతలు) పార్టీ వీడే వ్యక్తులం కాదు. మేం కాంగ్రెస్‌ను విడిచి ఎక్కడికీ వెళ్లేది లేదు. తమకు (అధిష్ఠానానికి) సన్నిహితులుగా భావిస్తున్న నేతలే పార్టీని విడిచి వెళ్తున్నారు. మా వాళ్లు కాదని అనుకుంటున్న వారే.. ఇప్పటికీ వారి వెంట నడుస్తున్నారు. కాంగ్రెస్‌లో ఏకస్వామ్యం ఉండకూడదు. పార్టీ పరిస్థితి పై అంతర్గతంగా చర్చలు జరగాలి. పార్టీని బలోపేతం చేయాలి. కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. పార్టీకి వ్యతిరేకంగా నేనెప్పుడూ మాట్లాడలేదు. కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటాను."
-కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత
ఆజాద్ లేఖ
కాంగ్రెస్ మరో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. అత్యవసరంగా సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. ప్రస్తుత పరిస్థితిపై పార్టీ నేతల సమక్షంలో చర్చించాలని సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సిబల్ వ్యాఖ్యలపై నిరసన
మరోవైపు, సిబల్ వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం రాత్రి ఆయన నివాసం ఎదుట నిరసనకు దిగారు. త్వరగా కోలుకోవాలంటూ రాసి ఉన్న ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. కపిల్ సిబల్ వ్యాఖ్యలు తమను బాధించాయని, అందుకే తమంతట తాముగా వెళ్లి ఆయన నివాసం ఎదుట నిరసన చేసినట్లు దిల్లీ పీసీసీ వర్గాలు వెల్లడించాయి. సిబల్ వ్యాఖ్యల పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు సైతం విమర్శలు గుప్పించారు.
పార్టీలో సంస్కరణలు చేస్తూ అధిష్ఠానానికి లేఖ రాసిన వారిలో కపిల్ సిబల్ ఒకరు. మొత్తం 23 మంది (G23 Leaders) సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు ప్రయత్నించాలని సిఫార్సు చేస్తున్నారు.
ఇదీ చదవండి: