kanpur farmer suicide: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. తన భూమిని అన్యాయంగా నగరపంచాయతీ ఆక్రమించుకుని.. అక్రమ మైనింగ్ చేస్తోందని ఇంద్రపాల్ సింగ్ భదోరియా అనే రైతు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహం రసూలాబాద్ ప్రాంతంలోని దేవాలయం దగ్గర అనుమానాస్పద రీతిలో కనిపించింది. మృతుడి దగ్గర ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కాన్పుర్ దేహాత్ జిల్లాలో ఆదివారం జరిగింది.
నగర పంచాయతీ ఛైర్మన్, ప్రతినిధుల కలిసి తన భూమిని ఆక్రమించుకున్నట్లు సూసైడ్ నోట్లో రైతు రాశాడు. 'నా భూమిని నగర పంచాయతీ బలవంతంగా ఆక్రమించుకుంది. ఆ భూమి పత్రాలన్నీ నా వద్ద ఉన్నాయి. మా కుటుంబాన్ని ఎవరూ ఇబ్బందులకు గురిచేయకండి' అని సూసైట్ నోట్లో రాశారు. మృతుడు రెండు సూసైడ్ నోట్‌లు రాసినట్లు పోలీసులు తెలిపారు. ఒకటి స్థానిక పోలీస్‌స్టేషన్‌కి.. మరొకటి జిల్లా డిప్యూటీ కలెక్టర్‌కు రాశాడని వెల్లడించారు. తహసీల్దార్ నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు పలుమార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రైతు ఆరోపణలపై విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఆఫీసర్ ఆశాపాల్ సింగ్ తెలిపారు. సంబంధిత వ్యక్తులు ఆరుగురిపై ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని తెలిపారు.
ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు. భాజపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 'కాన్పుర్‌లోని నగర పంచాయతీ సభ్యులు పొలాన్ని అక్రమంగా ఆక్రమించుకోవడం వల్ల ఓ రైతు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చాలా విచారకరం. బాధిత కుటుంబానికి తక్షణమే పరిహారం అందించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా' అని అఖిలేశ్ అన్నారు.
ఇదీ చదవండి: రాహుల్‌పై అభిమానం.. రూ.లక్షల ఆస్తిని రాసిచ్చిన మహిళ