వచ్చే తమిళనాడు ఎన్నికల్లో 'కళగమ్ పార్టీల'తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్. డీఎమ్‌కే, ఏఐఏడీఎంకేను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తే ఆర్థిక విప్లవంపై తమ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తుందని కాంచీపురంలో వెల్లడించారు.
"అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలను తీసుకువస్తాం. ప్రజల గుమ్మం ముందే సేవలను అందిస్తాం."
-కమల్ హాసన్
రాష్ట్రంలో అన్ని ఇళ్లను ఇంటర్నెట్తో అనుసంధానిస్తామని కమల్ చెప్పారు. ఇంటర్నెట్ను పొందడం ప్రాథమిక హక్కుగా ప్రకటిస్తామని అన్నారు. ప్రతి ఇంటికి 200ఎమ్‌బీపీఎస్ డేటాను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించి, వలసలను అరికడతామని స్పష్టం చేశారు. చిన్న తరహా పరిశ్రమల కల్పనకు ప్రోత్సహకాలు అందిస్తామని చెప్పారు.