మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో వీరంతా హస్తం పార్టీలో చేరారు. జూపల్లి కృష్ణారావుతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కుమారుడు రాజేశ్ రెడ్డి, ఎంపీపీ మేఘా రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రియాంకా గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాలని నాయకులు భావించారు. కానీ భారీ వర్షాల కారణంగా జులై 20, జులై 30న రెండుసార్లు ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా పడింది. అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో ఇప్పట్లో ప్రియాంక గాంధీ సభ ఉండే అవకాశం లేదు. దీంతో పార్టీలో చేరిన తర్వాత.. బహిరంగ సభ నిర్వహించుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖర్గే సమక్షంలో నిన్న పార్టీలో చేరాల్సి ఉండగా.. రాష్ట్రపతితో భేటీ కారణంగా ఆయన సమయం కేటాయించలేదు. దీంతో ఉదయం మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా 'బీఆర్‌ఎస్‌ను వదిలి కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉంది. కేసీఆర్ పాలనను చూసి చాలా బాధగా ఉంది. ఏ రంగంలో కూడా ఆశించిన ఫలితాలు రాలేదు. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం మంటకలిసింది. 3 నెలల తర్వాత పెట్టాల్సిన ఎక్సైజ్ టెండర్లను ఇప్పుడు పెట్టడం దారుణం' అని జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.
జాయినింగ్ భారీగా ప్లాన్ చేసినా..: బీఆర్‌ఎస్ బహిష్కృత నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లుగా గతంలోనే ప్రకటించగా.. ఖమ్మం జనగర్జన సభ వేదికగా పొంగులేటి కాంగ్రెస్ గూటికి చేరారు. ఖమ్మం మాదిరిగానే నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోనూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రియాంక గాంధీ సమక్షంలో హస్తం పార్టీలో చేరాలని జూపల్లి నిర్ణయించుకోగా.. పలు కారణాలతో ఆమె పర్యటన వాయిదా పడుతూ వచ్చింది. దీంతో సభను వాయిదా వేయక తప్పలేదు. దీంతో జూపల్లి సహా జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు ఈ ఉదయం కాంగ్రెస్ గూటికి చేరారు.
ఇదిలా ఉండగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఒకరి కంటే ఎక్కువ మంది ఆశావహులు ఉన్నారు. ఈసాని ఎన్నికల్లో కచ్చితంగా తమకే టికెట్ దక్కుతుందన్న ఆశతో పార్టీకి సేవలు చేస్తూ వస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు ఇతర పార్టీలకు చెందిన కొత్త నేతల చేరికలతో వారిలో గందరగోళం మొదలైంది. ఈ క్రమంలోనే ఇంతకాలం పార్టీని నమ్ముకుని ఉన్న పాత వాళ్లకే టిక్కెట్లు కేటాయించాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాలలోనూ విభేదాలను పక్కన పెట్టి.. అందరూ కలిసి ముందుకు సాగేలా అధినాయకత్వం చర్యలు చేపట్టింది.
ఇవీ చూడండి..:
Telangana Congress : కాంగ్రెస్‌లో తాత్కాలికంగా ఆగిన చేరికలు.. ఆ తర్వాతనే మళ్లీ జోరు
Congress Kollapur Meeting : పాలమూరు ప్రజాభేరికి ప్రియాంకా గాంధీ