NALLARI KIRANKUMAR REDDY COMMENTS ON CONGRESS: తాను కాంగ్రెస్‌ను వీడతానని ఎప్పుడూ అనుకోలేదని ఉమ్మడి ఏపీ చివరి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన భారతీయ జనతా పార్టీలోకి చేరారు. దిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రహ్లాద్ జోషి, అరుణ్‌సింగ్, డా. లక్ష్మణ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తప్పుడు నిర్ణయాలతో అధికారం కోల్పోయిందని కిరణ్ తెలిపారు. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ నాయకత్వం చెల్లాచెదురైందని.. ఎవరి నాయకత్వంలో పనిచేయాలో అనే అయోమయం ఏర్పడిందన్నారు. పార్టీల అభివృద్ధి కాలగమనంలోనే తెలుస్తుందని.. బీజేపీ ఎదుగుతున్నకొద్దీ కాంగ్రెస్ దిగజారుతూ వచ్చిందని పేర్కొన్నారు.
కాయకల్ప చికిత్సలో కాంగ్రెస్ విఫలమైంది: 1980లో 7.7 శాతం ఉన్న బీజేపీ ఓటింగ్.. 2019లో 37 శాతానికి పెరిగిందని.. అదే పరిణామక్రమంలో కాంగ్రెస్ పార్టీ 19 శాతానికి పడిపోయిందని స్పష్టం చేశారు. పరిణామాలు అర్థం చేసుకుని కాయకల్ప చికిత్సలో కాంగ్రెస్ విఫలమైందని ఆక్షేపించారు. వాస్తవాలు గ్రహించకుండా తాము చేసేదే సరైందని కాంగ్రెస్ ఉండిపోయిందని విమర్శించారు. చికిత్స జరగక కాంగ్రెస్ ఊహించనంతగా దిగజారిపోయిందని ధ్వజమెత్తారు. బీజేపీ నాయకత్వం ఒక్కో మెట్టు ఎక్కుతూ విస్తృతమైందన్న కిరణ్.. కాషాయ నాయకత్వంలో దేశ నిర్మాణం పట్ల స్పష్టమైన అవగాహన ఉందన్నారు.
"నేను కాంగ్రెస్‌ను వీడతానని ఎప్పుడూ అనుకోలేదు. కాంగ్రెస్ అధిష్ఠానం తప్పుడు నిర్ణయాలతో అధికారం కోల్పోయింది. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ నాయకత్వం చెల్లాచెదురైంది. ఎవరి నాయకత్వంలో పనిచేయాలో అయోమయం ఏర్పడింది. పార్టీల అభివృద్ధి కాలగమనంలోనే తెలుస్తుంది. బీజేపీ ఎదుగుతున్నకొద్దీ కాంగ్రెస్ దిగజారుతూ వచ్చింది. పరిణామాలు అర్థంచేసుకుని కాయకల్ప చికిత్సలో కాంగ్రెస్ విఫలమైంది. వాస్తవాలు గ్రహించకుండా మేం చేసేదే సరైందని కాంగ్రెస్ ఉండిపోయింది."-నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి, బీజేపీ నేత
బీజేపీ సంకల్పం గొప్పది: బీజేపీకి ఆలోచన, ఆచరణలో స్పష్టత ఉందని.. శక్తిమంతమైన నాయకులే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారన్నారు. పేదలకు సేవ చేయడమే జాతి నిర్మాణమన్న సంకల్పం.. పార్టీని దేశవ్యాప్తంగా గ్రామగ్రామానికి విస్తరించాలన్న ఆశయం బీజేపీకి ఉందని కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ విస్తరణ అనేది ప్రణాళికాబద్ధంగా సాగుతోందని.. దేశం కోసం మోదీ, అమిత్ షాలు కంకణబద్ధులై ఉన్నారన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు మోదీతో అప్పుడప్పుడు కలిసిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు.
"దేశం కోసం మోదీ, అమిత్ షాలు కంకణబద్ధులై ఉన్నారు. మోదీ, అమిత్ షా నాయకత్వ పటిమతోనే బీజేపీలో చేరుతున్నా. బీజేపీ నుంచి ఏమీ ఆశించట్లేదు. పార్టీ అప్పగించిన పనిని సమర్థంగా నిర్వహిస్తా" -కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నేత
మోదీ, అమిత్ షా నాయకత్వ పటిమతోనే బీజేపీలోకి: కాంగ్రెస్‌లో పొరపాట్లను సరిదిద్దుకునే ఆలోచన లేకుండా పోయిందని.. కానీ బీజేపీ ఎప్పటికప్పుడు పొరపాట్లు సరిదిద్దుకుంటూ ముందుకెళ్తోందని కొనియాడారు. మోదీ, అమిత్ షా నాయకత్వ పటిమతోనే తాను బీజేపీలోకి చేరుతున్నట్లు కిరణ్ ప్రకటించారు. బీజేపీ నుంచి ఏమీ ఆశించట్లేదని.. పార్టీ అప్పగించిన పనిని సమర్థంగా నిర్వహిస్తానని తేల్చిచెప్పారు.
బీజేపీలోచేరికతో కొత్త ఇన్నింగ్స్: నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చేరికతో ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. నల్లారి కుటుంబంలోని 3 తరాలు ప్రజలకు సేవలు అందించాయని గుర్తు చేశారు. ఎమ్మెల్యే, సభాపతి, సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి సేవలందించారని తెలిపారు. కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారని ప్రహ్లాద్ తెలిపారు. మోదీ పరిపాలన నచ్చి కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరారని.. అవినీతిపై మోదీ తీసుకుంటున్న చర్యలు ఆయన్ను ఆకట్టుకున్నాయని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: