దేశంలో సింగిల్ డోసు టీకా అత్యవసర వినియోగానికి.. అనుమతి కోరుతూ అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. టీకా అనుమతి కోసం కేంద్రాన్ని సంప్రదించనున్నట్లు జాన్సన్ సంస్థ గత సోమవారం ప్రకటించగా.. తాజాగా అత్యవసర వినియోగ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు.
మరోవైపు సింగిల్స్ డోసు టీకా తయారీకి సంబంధించి.. భారత్‌కు చెందిన బయోలాజికల్-ఈతో జాన్సన్ అండ్ జాన్సన్ భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో.. కేంద్రం సింగిల్ డోసు టీకాకు అనుమతిస్తే దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలకు బయోలాజికల్-ఈ ద్వారా, టీకాలు అందించేందుకు మార్గం సుగమం అవుతుందని అమెరికన్ సంస్థ తెలిపింది.
మరోవైపు తమ సింగిల్ డోసు టీకా 85శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో నిరూపితమైందని జాన్సన్ తెలిపింది. టీకా పొందిన 28 రోజుల తర్వాత కరోనాతో ఆసుపత్రిలో చేరటం, మరణం వంటివి గుర్తించలేదని చెప్పింది.
దేశంలో ఇప్పటికే కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి టీకాలు అందుబాటులో ఉన్నాయి.
ఇదీ చూడండి: కరోనా వేళ.. జీవన హక్కుకు హామీ లభించేనా?