స్వయంప్రతిపత్తి రద్దు తర్వాత జమ్ముకశ్మీర్లో తొలిసారి ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన డీడీసీ ఎన్నికల ఫలితాల్లో భాజపా సత్తా చాటుతోంది. గుప్కార్ కూటమికి గట్టి పోటీ ఇస్తూ కమలనాథులు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా జమ్ములో భాజపా హవా నడుస్తోంది. మెజార్టీ స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. కశ్మీర్లో మాత్రం గుప్కార్ కూటమి జోరు చూపిస్తోంది. అయినప్పటికీ కశ్మీర్ లోయలోనూ భాజపా ఖాతా తెరిచింది.
జమ్ములో భాజపా.. కశ్మీర్లో గుప్కార్..
జమ్ము కశ్మీర్లో డీడీసీల ఏర్పాటు ఇదే మొదటిసారి. ఆర్టికల్ 370, 35ఏ రద్దు తర్వాత.. తొలిటిసారి ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలోకి దించి ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, పీపుల్స్ మూవ్మెంట్, పీపుల్స్ కాన్ఫరెన్స్ సహా మరో నాలుగు పార్టీలు కలిసి.. 'పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్' ఏర్పాటు చేసుకుని సంయుక్తంగా బరిలోకి దిగాయి.
అయితే అంచనాలకు మించి జమ్ములో భాజపా సత్తా చాటుతోంది. గుప్కార్ కూటమిని వెనక్కి నెట్టి మెజార్టీ స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. జమ్ములో పార్టీ బలంగా పుంజుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కశ్మీర్లో మాత్రం గుప్కార్ కూటమి హవా నడుస్తోంది. ఇక్కడ మెజార్టీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ భాజపా ఖాతా తెరవడం గమనార్హం. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటికీ ఇక్కడ భాజపా పలు స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది.
"కశ్మీర్ లోయలో భాజపా ఖాతా తెరిచింది. మరికొన్ని చోట్ల కమలం ఆధిక్యం కనబరుస్తోంది. కశ్మీర్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారనడానికి ఇది నిదర్శనం."
- షానవాజ్ హుస్సేన్, భాజపా నేత
పుంజుకున్న కాంగ్రెస్..
ఇటీవల జరుగుతోన్న పలు ఎన్నికల్లో డీలా పడిన కాంగ్రెస్.. డీడీసీ ఎన్నికల్లో పుంజుకుంది. పార్టీకి కొత్త జవసత్వాలు ఇచ్చేలా జమ్ము, కశ్మీర్ ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు చెప్పుకోదగ్గ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.