దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతితో మరో ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని జులైలో జరగాల్సిన జేఈఈ అడ్వాన్స్ 2021 పరీక్షను ఐఐటీ ఖరగ్‌పుర్ వాయిదా వేసింది. తదుపరి పరీక్ష తేదీలను అనువైన సమయంలో ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు షెడ్యూల్ ప్రకారం జేఈఈ అడ్వాన్స్ పరీక్ష జులై 3న జరగాల్సి ఉంది. జేఈఈ మెయిన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్ రాసే అవకాశముంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంక్ సాధించే విద్యార్థులు దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో ప్రవేశాలు పొందొచ్చు.
ఇదిలా ఉండగా.. కరోనా కారణంగా జేఈఈ మెయిన్ మూడు, నాలుగు సెషన్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఈ ఏడాది నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలను నాలుగు విడతలో నిర్వహించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో రెండు విడతల పరీక్షలు పూర్తయ్యాయి. అయితే ఆ తర్వాత దేశంలో కరోనా విజృంభించడం వల్ల ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన సెషన్లను వాయిదా వేశారు. వాటిని రీషెడ్యూల్ చేసి త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.
ఇదీ చదవండి : నాడు వీరప్పన్ దాడిలో గాయపడిన పోలీసు మృతి