తమిళనాడు ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. సోదాలు ముమ్మరం చేసింది ఆదాయపన్ను శాఖ. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలో టైల్స్, శానిటరీ ఉత్పత్తుల్లో ప్రముఖంగా పేరొందిన ఓ సంస్థ కార్యాలయాల్లో జరిగిన ఐటీ దాడుల్లో సూమారు 220 కోట్ల రూపాయల అక్రమ ఆదాయం వెలుగుచూసింది. ఫిబ్రవరి 26న చెన్నై సహా.. గుజరాత్, కోల్‌కత్తాలోని 20చోట్ల ఐటీ దాడులు నిర్వహించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ప్రకటించింది.
రహస్య సాఫ్ట్‌వేర్‌తో..
టైల్స్ అమ్మకం, కొనుగోలుకి సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన అధికారులు.. రహస్య కార్యాలయాన్ని కనుగొన్నారు. క్లౌడ్ టెక్నాలజీ ద్వారా రహస్య సాఫ్ట్‌వేర్‌ను నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఈ దాడుల్లో రూ.8.30కోట్ల నగదును సీజ్ చేయగా.. లెక్కల్లో చూపని 100కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలను గుర్తించారు. మొత్తం లావాదేవీల్లో 50శాతం మాత్రమే కంపెనీ రికార్డుల్లో నమోదవుతున్నట్లు తెలిపారు.
షెల్ కంపెనీలు..
మునుపటి టర్నోవర్‌ను పరిశీలిస్తే.. తగ్గించి చూపిన కంపెనీ ఆదాయం రూ.120 కోట్ల మేర ఉండవచ్చని.. షెల్ కంపెనీల ద్వారా షేర్ల రూపంలో సంస్థ మళ్లించిన 100 కోట్ల రూపాయల అప్రకటిత ఆదాయానికి ఇది అదనమని సీబీడీటీ వివరించింది. దీంతో కంపెనీ మొత్తంగా రూ.220కోట్ల మేర లెక్కల్లో చూపని ఆదాయాన్ని కనుగొన్నారు.
తమిళనాడు, పుదుచ్చేరిల్లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు పార్టీలు యత్నించే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయిలో తనిఖీ, పర్యవేక్షణకు సీబీడీటీ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వివరించారు.
ఇదీ చదవండి: అసోంలో 1.08 లక్షల అనుమానిత ఓటర్లు