కాంగ్రెస్ పార్టీ అంటే అర్ధం.. అబద్ధాలు, గందరగోళం, అస్థిరత, హింస, అవినీతి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. అసోంలోని బోకాఖాట్‌లో శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని.. కాంగ్రెస్ తమ పాలనలో ఈ రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు.
కాజీరంగా పార్కులో కొమ్ముల కోసం ఖడ్గమృగాలు వేటకు గురికాకుండా కాపాడి, వేటగాళ్లను తాము జైలుకు పంపామని మోదీ తెలిపారు. ఏళ్ల తరబడి అసోంలో సాగిన హింసకు ఎన్డీఏ ప్రభుత్వం తెరదించి శాంతి, సుస్థిరత తీసుకువచ్చిందని వెల్లడించారు. సుదీర్ఘ కాలం అసోంను పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. అయిదేళ్ల పాలనలో ఈ రాష్ట్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్ధాయిలో అభివృద్ధి చేసిందని తెలిపారు. అసోంలో మళ్లీ తమ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం అని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.
" కాంగ్రెస్ పాలనా కాలంలో దోపిడీ నుంచి అసోంను ఎలా కాపాడాలి అనే ప్రశ్న ఉండేది. ప్రతి అసోం వాసి నుంచి ఈ ప్రశ్న వస్తూ ఉండేది. ఎన్డీఏ పాలనలో అసోం ప్రస్తుతం కొత్త శిఖరాలను అందుకునేందుకు పూర్తి బలంతో ముందుకు సాగుతోంది. బ్రహ్మపుత్ర నది రెండు తీరాల మధ్య అనుసంధానం ఎలా చేయాలి అని కాంగ్రెస్ పాలనలో ప్రశ్న ఉండేది. ఎన్డీఏ పాలనలో బ్రహ్మపుత్ర నది మీద ఆధునిక వంతెన నిర్మాణం జరుగుతోంది. ఆగిపోయిన పాత వంతెనల నిర్మాణాలను పూర్తి చేస్తున్నాం. అసోంలో రెండో సారి భాజపా ప్రభుత్వం ఏర్పడుతుందని నిశ్చయమైపోయింది."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఇదీ చూడండి: సైనిక శక్తిలో నాలుగో స్థానంలో భారత్