ISRO Upcoming Missions In 2024 : చంద్రయాన్-3 విజయంతో జోష్ మీదున్న ఇస్రో జాబిల్లి ఉపరితలం నుంచి కొన్ని రాళ్లను తీసుకురావాలని తదుపరి లక్ష్యంగా పెట్టుకుంది. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ ఆ మిషన్‌కు సంబంధించి కొన్ని విషయాలను వెల్లడించారు. జాబిల్లి మీద తమ ఆసక్తి ఇంకా తగ్గిపోలేదని త్వరలో చంద్రుడి ఉపరితలం నుంచి రాళ్లను భూమిపైకి తీసుకొస్తామని పేర్కొన్నారు. అయితే ఇది అంత తేలికైన లక్ష్యం కాదని సోమ్‌నాథ్ అన్నారు.
నాలుగేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యం
ISRO Upcoming Missions List : చంద్రుడి ఉపరితలంపై రాళ్లను సేకరించి తిరిగి భూమిపైకి సురక్షితంగా తీసుకొని రావడానికి చంద్రయాన్-3లో ఉపయోగించిన సాంకేతికత కన్నా అధునాతనమైన సాంకేతికత అవసరమని సోమ్‌నాథ్ వివరించారు. ఇలా ఒక వస్తువును లేదా ఖనిజాలను భూమిపైకి తీసుకురావడమనేది సంక్లిష్టమైన మిషన్ అని అన్నారు. ప్రస్తుతం దీని కోసం డిజైన్ రూపొందిస్తున్నామన్న ఆయన నాలుగేళ్లలో దాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
అంతరిక్షంలో అడుగుపెట్టే దిశగా
అంతరిక్షంలోకి భారతీయుడిని పంపే పనులు కొనసాగుతున్నాయని సోమ్‌నాథ్ వివరించారు. మిషన్‌కు సంబంధించిన క్రూ మాడ్యూల్ డిజైన్ పూర్తయిందని చెప్పారు. మానవులను అంతరిక్షంలోకి సురక్షితంగా తీసుకెళ్లడం సహా వారిని తిరిగి భూమిపైకి సురక్షితంగా తీసుకొస్తామని తెలిపారు. ఈ మిషన్ భద్రత కోసం చాలా కష్టపడుతున్నామని చెప్పారు. అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలనేది తమ కోరికన్న ఆయన ప్రధాని మోదీ అందుకు సంబంధించిన సన్నాహాలను సమీక్షించి 2035కల్లా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. చంద్రయాన్-3నమునాలను రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించే అవకాశం ఉందని సోమ్‌నాథ్ తెలిపారు.
సూర్యుడి పోటొలు తీసిన ఆదిత్య ఎల్-1
Aditya L1 Sun Images : సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్రో పంపించిన ఆదిత్య-ఎల్1 మరిన్ని అరుదైన చిత్రాలను తీసింది. అతినీలలోహిత తరంగ దైర్ఘ్యం చేరువ నుంచి సూర్యుడి చిత్రాలను బంధించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇస్రో షేర్ చేసింది. సౌరకుటుంబ పరిశోధనలో ఇదో కీలక మైలురాయిగా అభివర్ణించింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.