Is Phone Call Recording Illegal In India : అవతలి వ్యక్తికి తెలియకుండా ఫోన్‌కాల్‌ను రికార్డ్ చేయడాన్ని గోప్యత హక్కు ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఇది రాజ్యాంగంలోని అధికరణం 21 గోప్యత హక్కు ఉల్లంఘన కిందికి వస్తుందని స్పష్టం చేసింది. 2019 నుంచి పెండింగులో ఉన్న నిర్వహణ ఖర్చుల కేసుకు సంబంధించి తన భర్త (44) పిటిషన్‌ను అనుమతిస్తూ ఓ మహిళ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా భార్య అనుమతి లేకుండా భర్త ఆమె ఫోను సంభాషణలను రికార్డు చేసిన విషయం ఉన్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది.
ఛత్తీస్‌గఢ్.. మహాసముంద్ జిల్లాకు చెందిన ఈ కేసులో తన భర్త నుంచి నిర్వహణ ఖర్చులు ఇప్పించాల్సిందిగా మహిళ మొదట కుటుంబ న్యాయస్థానానికి వెళ్లారు. ఫోనులో తాను రికార్డు చేసిన ఆమె సంభాషణల ఆధారంగా తన భార్యను మరోమారు విచారించాలని భర్త ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. ఆమెకు ఇతరులతోనూ సంబంధాలు ఉన్నాయన్న విషయం ఫోన్ రికార్డింగ్ ద్వారా రుజువైతే, విడాకుల తర్వాత తాను మెయింటెనెన్సు ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నది అతడి ఉద్దేశం. భర్త వినతిని స్వీకరించిన ఫ్యామిలీ కోర్టు తీర్పును భార్య హైకోర్టులో సవాలు చేశారు.
మహిళ గోప్యత హక్కుకు భంగకరమైన ఫోన్ రికార్డింగ్ ఆధారంగా భర్త పిటిషన్‌ను అనుమతించారని.. తద్వారా ఫ్యామిలీ కోర్టు చట్టపరమైన తప్పిదం చేసిందని ఉన్నత న్యాయస్థానంలో బాధితురాలి న్యాయవాది వైభవ్ ఏ గోవర్ధన్ వాదించారు. తన వాదనకు మద్దతుగా గతంలో సుప్రీంకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టులు ఇచ్చిన కొన్ని తీర్పులను ఆయన ఉదహరించారు. ఇరు పక్షాల వాదనల తర్వాత ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు జడ్జి జస్టిస్ రాకేశ్ మోహన్ పాండే తోసిపుచ్చారు. ఆ ఆదేశాలను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఫోన్ రికార్డింగు ఆధారంగా భర్త దరఖాస్తును ఫ్యామిలీ కోర్టు అనుమతించడం చట్టపరమైన తప్పిదమే అని వ్యాఖ్యానించారు.
Family Court Divorce Act: కొన్నాళ్ల క్రితం ఓ కేసు విచారణలో భాగంగా దొంగచాటుగా భార్య ఫోన్ సంభాషణలను రికార్డ్ చేయడం తప్పేనని పంజాబ్-హరియాణా హైకోర్టు తెలిపింది. భార్యకు తెలియకుండా ఇలాంటి పనులు చేయడం ఆమె గోప్యతకు భంగం కలిగించినట్టే అవుతుందని పేర్కొంది. భార్యాభర్తల విడాకుల కేసు విషయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మొబైల్స్‌లో 'కాల్ రికార్డింగ్' ఇక అసాధ్యం! గూగుల్ కొత్త రూల్స్!!
కొత్త రూల్స్- రెండేళ్ల పాటు కాల్ రికార్డింగ్స్ సేవ్ చేయాల్సిందే!