COVID Fourth Wave: దేశంలో కరోనా వైరస్ మళ్లీ ఆందోళన పెంచుతోంది. రోజువారీ వైరస్ కేసులు.. క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా దిల్లీలో మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. దిల్లీలోని కొవిడ్ రోగుల్లో దాదాపు 27 శాతం చిన్నారులేనని విశ్లేషణలు వెలువడ్డాయి. వైరస్ ఉద్ధృతితో ఉత్తర్‌ప్రదేశ్, హరియాణాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాస్కుల వినియోగం మళ్లీ తప్పనిసరి చేశారు. కేరళ, మిజోరం, మహారాష్ట్ర, దిల్లీ, హరియాణాల్లో పాజిటివిటీ రేటు ఎగబాకుతుండటంపై ఆయా రాష్ట్ర సర్కార్లను కేంద్రం అప్రమత్తం చేసింది. జూన్ నెలలో దేశీయంగా కొవిడ్ నాలుగోదశ తలెత్తవచ్చని ఐఐటీ కాన్పుర్ పరిశోధకుల బృందం అంచనా వేస్తోంది. ఈ అంచనా దేశంలో మరోసారి కొవిడ్‌పై భయాందోళనలను పెంచింది.
ఎప్పటికప్పుడు కొత్త అవతారాలు దాలుస్తున్న మహమ్మారి.. మానవాళిపై ఇంకా పంజా విసురుతూనే ఉంది. మొన్న డెల్టా.. నిన్న ఒమిక్రాన్, ఇప్పుడు దాని ఉపరకాలైన BA-1, BA-2, Xeలు తొలగిపోని కరోనా ముప్పునకు ప్రతిరూపాలుగా విలయతాండవం చేస్తున్నాయి. భారత్‌లోనూ ఈ కొత్త రకం కేసులు క్రమేణా పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. మహమ్మారిపై పోరాటం అప్పుడే ముగిసిపోలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల హెచ్చరించారు.
అధికారిక లెక్కల ప్రకారం దేశంలో ఇప్పటివరకు 4కోట్ల 30 లక్షల మందికిపైగా వైరస్ బారినపడగా.. 5లక్షల 22 వేల మంది మహమ్మారికి బలయ్యారు. వాస్తవంగా అంతకు ఎనిమిది రెట్ల మరణాలు సంభవించినట్లు లాన్సెట్ నివేదిక బయటపెట్టింది. కొవిడ్ నుంచి కోలుకున్న ప్రతి అయిదుగురిలో ఒకరు మెదడు, గుండె, ఊపిరితిత్తులు, క్లోమం, కీళ్లు.. తదితర సమస్యలతో బాధపడుతున్న అధ్యయనాలు చెబుతున్నాయి. దేశీయంగా దీర్ఘకాల కొవిడ్ ప్రభావంపై అధ్యయనం జరపాలని పార్లమెంటరీ స్థాయీసంఘం ఇటీవల కేంద్రానికి సూచించింది.
'మాస్క్ తప్పనిసరి': దిల్లీలో మళ్లీ కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో డీడీఎంఏ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ రాజధానిలో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. మాస్క్‌లు ధరించని వారిపై రూ. 500 జరిమానా విధించాలని నిర్ణయించింది. అయితే పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా కొనసాగించాలని సూచించింది.
ఇదీ చదవండి: 'సంప్రదాయ ఔషధాలపై ఆయుష్ ముద్ర.. వారికి ప్రత్యేక వీసా'