international passengers guidelines: కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' ఆందోళనల నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా పెంచింది పౌర విమానయాన శాఖ. 'ఎట్ రిస్క్' జాబితాలో లేని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఊరట కల్పించింది. ఆ దేశాల ప్రయాణికులు కేవలం 2 శాతం మంది ర్యాండమ్ నమూనాల సేకరణలో ఉంటారని స్పష్టం చేసింది. వారు సాంపిల్ ఇచ్చాక విమానాశ్రయం నుంచి వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది.
- ర్యాండమ్ సాంపిల్ సేకరణ కేవలం 2 శాతం మంది ప్రయాణికులకు పరిమితం. పరీక్ష ఖర్చు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
- ర్యాండమ్ నమూనాల సేకరణ కోసం ప్రయాణికుల ఎంపికలో విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారుల సమన్వయంతో పనిచేస్తాయి.
- 'ఎట్ రిస్క్' జాబితాలో లేని దేశాల నుంచి.. రిస్క్ జాబితాలోని దేశాల విమానాశ్రయం మీదుగా వచ్చిన వారికి ఎయిర్‌పోర్ట్‌లో కరోనా పరీక్షల నుంచి మినహాయింపు. స్వీయ వాంగ్మూల పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.
'ఎట్ రిస్క్' దేశాల నుంచి వచ్చే వారికి..
యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్‌తో పాటు మరికొన్ని ఐరోపా దేశాలను కేంద్రం 'ఎట్ రిస్క్' కంట్రీస్‌గా గుర్తించింది. ఈ దేశాల నుంచి ప్రయాణికులు భారత్‌కు చేరుకుంటే.. కేంద్రం సూచించిన అదనపు జాగ్రత్తలను పాటించాలి.
- 'ఎట్ రిస్క్' జాబితాలోని దేశాలకు గత 14 రోజుల్లో వెళ్లిన ప్రయాణికులకు ఇతర నిబంధనలతో పాటు కొవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలి.
- కరోనా పరీక్ష కోసం సాంపిల్ ఇచ్చిన ప్రయాణికులు తమ టెస్ట్ ఫలితాలు వచ్చే వరకు అక్కడే వేచి ఉండాలి. నెగెటివ్ ఫలితం వచ్చాకే బయటకు వెళ్లాలి లేదా కనెక్టింగ్ ఫ్లైట్‌లో తమ ప్రాంతానికి చేరుకోవాలి. ఇతర సహ ప్రయాణికుల పరీక్ష ఫలితాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు.
మహారాష్ట్ర కఠిన నిబంధనలు- కేంద్రం అసహనం
అంతర్జాతీయ ప్రయాణికులపై కఠిన నిబంధనలు అమలు చేస్తోంది ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం. భారత్‌కు వచ్చే, భారత్ మీదుగా ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు ముందుగా ఎయిర్ సువిధ ఆన్లైన్ పోర్టల్‌లో 14 రోజుల పర్యటన వివరాలతో కూడిన స్వీయ వాంగ్మూల పత్రం, పాస్‌పోర్ట్ కాపీ, 72 గంటల్లోపు ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ సమర్పించాలని స్పష్టం చేసింది. ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా పరీక్షల నుంచి మినహాయింపు ఉంటుందని, కొవిడ్ లక్షణాలు ఉంటే తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది.
- ఎట్ రిస్క్ దేశాల ప్రయాణికులు 7 రోజుల క్వారంటైన్‌కు వెళ్లాలి. అక్కడే 2, 4, 7 రోజుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్షల్లో కరోనా నిర్ధరణ అయితే, వారిని ఆసుపత్రికి తరలిస్తారు. నెగెటివ్ రిపోర్ట్ వస్తే మరో ఏడు రోజుల పాటు క్వారంటైన్ కొనసాగించాలి.
- ఎట్ రిస్క్ జాబితాలో లేని దేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకోవాలి. నెగెటివ్‌గా వస్తే 14 రోజుల హోంక్వారంటైన్‌కు వెళ్లాలి. పాజిటివ్‌గా వస్తే ఆసుపత్రికి తరలిస్తారు.
అంతర్జాతీయ ప్రయాణికుల మార్గదర్శకాలపై మహారాష్ట్ర ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఆర్టీపీసీఆర్ పరీక్షలు, క్వారంటైన్ వంటి నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు.. కేంద్ర నిబంధనలకు భిన్నంగా ఉన్నాయని మహారాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంరక్షణ విభాగం అదనపు చీఫ్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ వ్యాస్‌కు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. కేంద్రం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్‌తో రాష్ట్ర ఉత్తర్వులను సరిచేయాలని కోరారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఒకేవిధమైన మార్గదర్శకాలు అమలులో ఉంటాయన్నారు. మార్పులు చేసిన కొత్త నిబంధనలపై ఎక్కువగా ప్రచారం చేసి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చాడాలని సూచించారు.
ఇదీ చూడండి: అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు!