Intermediate Student Mystery Murder in Chittoor district: తమ కుమార్తెను దారుణంగా హత్య చేసి గుర్తుపట్టలేని విధంగా మార్చేశారని, హంతకులను కఠినంగా శిక్షించి తన కుమార్తె మృతికి న్యాయం చేయాలని ఓ తల్లి పోలీసులను వేడుకుంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం వేణుగోపాలపురం గ్రామానికి చెందిన పద్మావతి, మునికృష్ణయ్య దంపతుల కుమార్తె భవ్య శ్రీ (16) పెనుమూరులోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది.
ఈనెల 17వ తేదీన ఇంటి నుంచి పెనుమూరుకు వెళ్లిన బాలిక భవ్య శ్రీ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు తమ సమీప బంధువుల ఇళ్లల్లో వాకబు చేశారు. సోమవారం ఉదయం తన కుమార్తె కనపడటం లేదంటూ పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటర్ విద్యార్థిని మిస్సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
MURDER MYSTERY: భూత వైద్యుడినంటూ లోబరుచుకుని.. పెళ్లికి పట్టుబట్టిందని హతమార్చి
Chittoor Girl Bhavya Sri Murder: ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ కనిపించడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో సమాచారం వైరల్‌గా మారడంతో పలువురు భవ్య శ్రీ జాడ కోసం వెతకడం మొదలుపెట్టారు. బుధవారం రాత్రి పెనుమూరు మండలం ఎగువచెరువు గ్రామానికి చెందిన యువకులు వినాయక నిమజ్జనం కోసం తమ గ్రామ పొలిమేరలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు గణపయ్యను తీసుకెళ్లారు. నిమజ్జనం చేస్తుండగా.. బావిలో గుర్తు తెలియని యువతి మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి తమ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదైన నేపథ్యంలో ఫిర్యాదుదారులకు సమాచారం ఇచ్చారు. బావి వద్దకు చేరుకున్న భవ్య శ్రీ తల్లిదండ్రులు మొదట ఆ మృత దేహం తమ కుమార్తెది కాదని పేర్కొని.. తర్వాత మృతదేహంపై ఉన్న ఆభరణాలను గుర్తించి గుర్తుపట్టినట్టు తెలిసింది.
ప్రేమ పేరుతో తమ కుమార్తెను ముగ్గురు యువకులు వేధించారని.. వారే మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లి దారుణంగా హత్య చేసి, బావిలో పడేశారని బాలిక తల్లిదండ్రులు వాపోయారు. ఆమెను మండలానికి చెందిన ముగ్గురు యువకులు ప్రేమపేరుతో వేధించేవారని తెలిపారు.
Intermediate Student Death in Chittoor: పొడవైన జుట్టుతో ఉండే తమ కుమార్తెను హత్య చేసి, దారుణంగా మార్చివేసి బావిలో పడేశారని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాము అనుమానం వ్యక్తం చేసిన వారిపై చర్యలు తీసుకొని పూర్తి వివరాలు రాబట్టి తమకు న్యాయం చేయాలంటూ గ్రామస్థులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు.
ఇంటర్ విద్యార్థిని భవ్య శ్రీ మృతి కేసులో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు రావడంతో పలు ప్రజాసంఘాలు నిరసనకు దిగాయి. ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ కేసు సంచలనంగా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు రంగ ప్రవేశం చేసి పలు కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు.
Chittoor District Girl Death: తమ కుమార్తె అదృశ్యంపై 18వ తేదీనే పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు సకాలంలో స్పందించి ఉంటే బతికి ఉండేదని వారు ఆరోపించారు. శవ పరీక్ష నివేదికలనూ తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమ కుమార్తె తలపై జుట్టు ఏమయిందని బాలిక తల్లిదండ్రులు.. పోలీసులను ప్రశ్నించారు.
భవ్య శ్రీ పట్ల వైద్యులు ప్రాథమికంగా ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మృతదేహం కనిపించిన బావిలోని నీటిని వెలుపలకు తీసి.. బాలిక తల వెంట్రుకలను గుర్తించారు. భవ్యశ్రీ మృతి విషయంలో ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు మొదలు పెట్టినట్లు ఎస్సై చెప్పారు. అనుమానితులను పిలిపించి విచారించామని.. వారి ఫోన్లలో కాల్‌డేటాను పరిశీలిస్తే అనుమానాస్పదంగా ఏమీ లేదని తెలిపారు. మృతదేహం నుంచి నమూనాలను పరీక్ష నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామన్నారు.
ఈ విషయమై మృతురాలి తల్లి పద్మావతి మాట్లాడుతూ తమ కుమార్తెది ముమ్మాటికి హత్యేనని.. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి.. భవిష్యత్తులో మరో ఆడబిడ్డకు ఇటువంటి అన్యాయం జరగకుండా చూడాలని వేడుకున్నారు. భవ్యశ్రీ మృతి కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అనుమానితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.